సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు చెందిన లబ్ధిదారులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత విజయనగరం నుంచి ఓ లబ్ధిదారు తల్లి మాట్లాడుతూ.. ‘‘మా పిల్లలిద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారంటే అందుకు కారణం మీరే. విద్యా దీవెన పథకం ద్వారా మా పిల్లలను పెద్ద చదువులు చదివించగల్గుతున్నాం. భవిష్యత్తులో మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాం. వసతి దీవెన మా పిల్లలిద్దరికి అందుతుంది. ఆ డబ్బు వల్ల బ్యాగ్, పుస్తకాలు కొనుగోలు చేశాం. పోషాకాహారం అందజేస్తున్నాం. మా పిల్లల బాధ్యత మొత్తం మీరే తీసుకుని.. వారిని చదివిస్తున్నారు. మాకు ఇల్లు లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ మధ్యే మాకు జగనన్న ఇళ్ల పథకం కింద ఇల్లు సాంక్షన్ అయ్యింది. మా సొంతింట కల మీ ద్వారానే నేరవేరనుంది. మీరు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాం’’ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నుంచి తేజ ప్రకాశ్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘డాక్టర్ వైఎస్‌ఆర్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదువుకునే అవకాశం కల్పించారు. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తున్నారు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. మీరు ప్రవేశపెట్టిన పథకాల వల్ల నేను చదువుకోగలిగాను.. ఇప్పుడు నాలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించాను. అందులో నేను ఇన్ఫోసిస్‌ను ఎంచుకున్నాను. మీరు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం వల్ల ఎంత లాభమో నాకు బాగా తెలుసు. ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందో నేను చూశాను. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల చదువు పూర్తి కాగానే ఉద్యోగం సాధిస్తారు. స్కిల్ డెవలెప్‌మెంట్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇందుకుగాను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అన్నాడు.
గుంటూరు కలెక్టరేట్ నుంచి మరో లబ్ధిదారు తల్లి మాట్లాడుతూ.. ‘‘నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నేను నా పిల్లలకు చదువు చెప్పించడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఆస్తులు ఇవాళ ఉంటాయ్.. రేపు పోతాయ్. అన్న నేను ఫీజలు కట్టడానికి చాలా ఇబ్బందలు పడ్డాను.. మీరు సీఎం అయిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకురావడంతో పిల్లల చదువుకు మార్గం సుగమం అయ్యింది. నాకు పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. నెలలో మొదటి వారంలోనే ఇంటి వద్దకే రేషన్ పథకం అమలు చేయడంతో చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. లబ్ధిదారు కుమార్తె అయిన విద్యార్థిని సుమిత్ర థాంక్యూ సోమచ్ మావయ్య అంటూ సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలియజేసింది.
అనంతపురం నుంచి ఇద్దరు విద్యార్థిణిలు మాట్లాడారు. ‘‘మా తల్లిదండ్రులకు నేను, మా అక్క ఇద్దరం ఆడపిల్లలం. నా బాగోగులు చూసుకునే అన్న ఉంటే బాగుండే అన్న వెలితి ఉండేది. మీరు ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఎంతో మంది విద్యార్థులకు భరోసా ఇస్తూ.. దేవుడిచ్చిన అన్నయ్యగా నిలిచారు. చదువుకోవాలని పట్టుదల ఉండి.. డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు తీసుకువచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన ఎంతో మేలు చేశాయి’’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment