సీమాంధ్ర పక్షపాతి సీఎం కిరణ్
సాక్షి, నెట్‌వర్క్ : సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీఆర్‌ఎస్ నాయకులు గోదావరిఖనిలో ధర్నా నిర్వహించారు. మహిళ వేషంతో రూపొందించిన సీఎం ఫ్లెక్సీని దహనం చేశారు. హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులపై దాడి చేసిన సీమాంధ్ర లాయర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు ర్యాలీ చేపట్టారు. సీమాంధ్రులు హైదరాబాద్‌లో సభ పెట్టి తెలంగాణ బిడ్డలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ రాయికల్‌లో యువజన సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సీఎం కిరణ్ సీమాంధ్ర తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ వరంగల్ జిల్లా పరకాలలో మంగళవారం ఏబీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర పోరులో పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరుతూ హన్మకొండలో న్యాయవాదులు వారికి పుష్పగుచ్చాలిచ్చి ఆహ్వానించారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో తెలంగాణవాదులు సద్భావన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలకు ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరయ్యారు.
హైదరాబాద్‌ను యూటీ చేస్తే మహోద్యమమే అంటూ టీజీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాగార్జునసాగర్ పైలాన్‌లోని జెన్‌కో అతిథిగృహం ఎదుట మంగళవారం రాత్రి తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేశారు. జెన్‌కో కార్యాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు కొందరు సాయంత్రం సమావేశమయ్యారని పుకార్లు రావడంతో తెలంగాణ వాదులు అక్కడికి వెళ్లారు. కాసేపటికి గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లిచూడగా ఎవరూ లేకపోవడంతో తెలంగాణ వాదులు వెనుదిరిగారు.
తెలంగాణ కోసం ఆగిన గుండె : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సమైక్యవాదులు అడ్డుకుంటున్నారన్న ఆందోళనతో నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన సూరారం యాదగిరి (35) మంగళవారం భావోద్వేగానికి గురై గుండెపోటుతో మృతిచెందాడు.