సిద్దిపేట, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నానని చెబుతూ తనను తానే స్టార్ బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణించుకోవడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తగదని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు అన్నారు. ఆట ముగిసిందని ఇక కిరణ్ పెవిలియన్ పట్టాల్సిందేనని చెప్పారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో టీడీపీకి చెందిన పలువురు మైనార్టీ నేతలు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు.
రిటైర్ అయిన సచిన్ నిజమైన స్టార్ బ్యాట్స్‌మెన్ కాగా, ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం డూప్లికేట్ బ్యాట్స్‌మెన్ అని ఆయన అభివర్ణించా రు. బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న కిరణ్ మ్యాచ్ ముగిసినప్పటికీ మైదానాన్ని వీడకుండా గాలిలో బ్యాట్ ఊపుతూ సిక్సర్లు, ఫోర్లు కొట్టినట్లుగా ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును క్రికెట్‌తో పోల్చుతున్న కిరణ్ వెంటనే మైదానాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని ప్రకటించగానే విభజనను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో కుట్రలు పన్నుతున్నారని హరీష్‌రావు విమర్శించారు. అఖిలపక్ష సమావేశానికి డుమ్మాకొట్టి ముఖం చాటేసిన చంద్రబాబు రెండు నాలుకల ధోర ణిని కొనసాగిస్తున్నారని విమర్శించారు.