సాక్షి, సిద్ధిపేట : అమరుల త్యాగాల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రం సాధించుకున్న ఫలితాలు, ఫలాలు ఈ రోజు సిద్ధిపేటకు అందాయన్నారు. గోదావరి జలాలు సిద్ధిపేటకు అందుతాయని చెప్పినట్లే ఇప్పుడు సాధించుకున్నామన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు. (తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ)
ఈ రోజు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని హరీష్ రావు అభివర్ణించారు. దేశంలో ఎవరు ఏ పథకాన్ని చేపట్టాలన్నా తెలంగాణ వైపే చూస్తున్నాయని, గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని ఈ రోజు పల్లె ప్రగతి ద్వారా సాధించామని పేర్కొన్నారు. పథకాలను చేపట్టడం, వాటికి నిధులు ఇవ్వడం, అమలు చేయడం జరిగిందన్నారు. కరోనాలాంటి విపత్తులు వచ్చినా అభివృద్ధిని కొనసాగిస్తూ, సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. (‘అన్ని వర్గాల ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టారు’)
ఉద్యమ సందర్భంలో ఏ విదంగా కృషి చేశామో అదే విదంగా రాష్ట్ర అభివృద్ధిలోనూ పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే అంకిత భావంతో రాబోయే రోజుల్లోనూ పనిచేస్తూ బంగారు తెలంగాణాకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment