సీఎంపై సభాహక్కుల నోటీసు: హరీశ్‌రావు
సిద్దిపేట, న్యూస్‌లైన్: అసెంబ్లీలో ‘మీరు.. మేము’ అంటూ ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీ సు ఇస్తామని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు చెప్పారు. 17న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఆ నోటీసును స్పీకర్‌కు అందజేస్తామని చెప్పారు. శనివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలు శాసనసభ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు.
విభజన బిల్లుపై శాసనసభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ప్రసంగిస్తున్న సమయంలో ‘రాష్ట్ర విభజన అధిష్టానానికి నాకు మధ్య సమస్య’ అని సీఎం అనడం ఆశ్చర్యకరంగా ఉందని హరీశ్ అన్నారు. గతంలో కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం, ఇప్పుడు వైఖరిని మార్చుకోవడం బాధాకరమన్నారు. సీఎం ఎప్పుడు మాట్లాడినా ‘మీరు, మేము’ అంటూ మాట్లాడతారని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణలో వడగండ్ల బాధితులకు నాలుగేళ్లుగా పరిహారం ఇవ్వలేదని, అదే సీమాంధ్రలో కొబ్బరి తోటల నష్టానికి పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. మట్టి మారినప్పటికీ విత్తు మాత్రం సీమాంధ్రదేనని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.