వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
47 ఏళ్లుగా వైఎస్సార్‌తో, వైఎస్సార్ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం ఉన్న వారందరికీ ఈ పుస్తకాన్ని అందిస్తాను. సహృదయంతో అందరూ చదవాలి. వైఎస్సార్ నాకు స్ఫూర్తి. ఆయన మాటలు మీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతాయని నమ్ముతున్నాను. రాజశేఖరరెడ్డి నావాడే కాదు. అందరి వాడని గర్వంగా చెబుతున్నా. ఈ అనుబంధం కలకాలం నిలవాలని, మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదా ఉండాలని కోరుకుంటున్నాను.
– వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. నాతోనే కాకుండా, రాష్ట్ర ప్రజలందరితోనూ ఆయనకు చెరగని బంధం ఉంది. ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం. ఆయన పిలుపు ఓ భరోసా. ఆయన మాట విశ్వసనీయతకు మారుపేరు. వైఎస్సార్ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయి.
–వైఎస్ విజయమ్మ
నాలో.. నాతో.. వైఎస్సార్’ అని అమ్మ..
నాన్నలో ఉన్న ఒక తండ్రి, ఒక భర్త, ఒక మంచి వ్యక్తి గురించి రాసింది. నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ రాసిన ఈ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించా. నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిచయమయ్యారు. నాన్నతోపాటు ప్రయాణం చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె తెలుసుకున్న, చూసిన దానిని ఈ పుస్తకంలో రాశారు.
– భావోద్వేగంతో సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. పూలమాలలు వేసి దివంగత వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం గురించి వైఎస్ జగన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. సీఎం భావోద్వేగాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడున్న వారందరూ చలించిపోయారు. అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. అనంతరం 9.30 గంటలకు సీఎం సమీపంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మ, షర్మిల.
జగన్‌ను ముద్దాడుతున్న వైఎస్ విజయమ్మ
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీలోని ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
► రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు, రూ.40 కోట్ల అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియంకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆరు ఎకరాల్లో రెండస్తుల్లో ప్రపంచ స్థాయి ఆడిటోరియం నిర్మిస్తున్నారు.
► 3 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు మరింత తగ్గి సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ.1.51 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా కానుంది. అనంతరం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
► తిరిగి 10 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం.. 10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భారతమ్మ, షర్మిల, వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతోపాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సురేష్, చీఫ్ విప్ గడికోట, విప్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శం : వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకం ఆవిష్కరణ అనంతరం ఆమె ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► నేను ఆయనలో చూసింది.. ఆయన మాటల్లో విన్నది.. నా 37 ఏళ్ల సహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది మా జీవితాల్లోకి వచ్చారు. ఎంతో మంది జీవితాలకు విలువనిచ్చారు ఆయన. ఆ విలువ నేను చూశాను. నేను విన్నాను. ఎంతో మంది మా జీవితాలకు వేసిన బాటలు అనుకుంటాను.
► ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు చాలా మంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టారు. ఆయనతో చెరగని బంధం నాకే కాదు... చాలా చాలా మందికి కూడా.
► చెరగని చిరునవ్వు, స్వచ్ఛతకు మారుపేరు ఆయన చిరునవ్వు. వైఎస్సార్ స్థైర్యం, దక్షత సాటిలేనివి. అందుకే ఆయన అందరిలో యుగయుగాలుగా నిలిచి ఉంటాడు. రాజశేఖరరెడ్డి గారి నుంచి నేను, నా పిల్లలు చాలా చాలా నేర్చుకున్నాము.
► ఈ రోజుకు నా పిల్లలు.. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మన నాన్న ఏం చేసేవాడు.. మా మామయ్య ఏం చేసేవాడు.. అని ఆలోచించి ముందుకు వెళతారు. మీకు ఏదైనా సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదై నా కష్టం వచ్చినా మీలో బాధ తొలిచి వేస్తున్నప్పుడు ఒక్కసారి ఈ పుస్తకం చదవమని మిమ్మల్ని కోరుతున్నా.. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాంటిది ఆయన జీవితం.
► ‘తనకు మాత్రమే సొంతమైన కోణం నుంచి నాన్నను లోకానికి అమ్మ కొత్తగా పరిచయం చేసింది. పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మతో, నాన్నతో కలసి ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. నిజం చెప్పడం సులభం కాదు. అయినా అమ్మ ధైర్యంగా నిజం చెప్పింది. అందుకే ఈ బయోగ్రఫీ అందరం చదవాలి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో పబ్లిషర్ విజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు’ అని షర్మిల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment