ఇది రైతు ప్రభుత్వం | CM YS Jagan Comments at inauguration of second year YSR Rythu Bharosa | Sakshi
Sakshi News home page

ఇది రైతు ప్రభుత్వం

Published Sat, May 16 2020 3:02 AM | Last Updated on Sat, May 16 2020 8:17 AM

CM YS Jagan Comments at inauguration of second year YSR Rythu Bharosa - Sakshi

గత నెలలో రూ.2 వేలు పొందని వారికి ఇప్పుడు రూ.7500 ఇస్తున్నాం. వచ్చే అక్టోబర్‌లో రూ.4 వేలు, ఆ తర్వాత పంట ఇంటికి వచ్చే సమయంలో సంక్రాంతి పండగ సందర్భంగా మరో రూ.2 వేలు ఇస్తాం. మా పార్టీకి ఓటు వేయకపోయినా సరే, అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరిగేలా పథకం అమలు చేస్తున్నాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఇది రైతుల ప్రభుత్వమని, రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. అందుకే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా రైతులను ఆదుకునేందుకు, వారి పంటల కొనుగోళ్ల కోసం రూ.1,000 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. ప్రతి విషయంలో రైతులకు మంచి జరగాలని ప్రభుత్వం పరితపిస్తోందని, అందుకే చెప్పిన దాని కంటే ముందే, ఇస్తానన్న దాని కన్నా ఎక్కువ సహాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. సాగు పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం రెండవ ఏడాది తొలి విడత కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.

సాగుకు ఇబ్బంది పడకూడదనే ఈ పథకం..
► రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. రైతు బాగుంటే రైతు కూలీ బాగుంటాడు. వారు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో అర హెక్టారు అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు 50 శాతం ఉండగా, ఒక హెక్టారు (2.5 ఎకరాలు) పొలం ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. 
► ఇటువంటి రైతులకు అప్పులతో సంబంధం లేకుండా, ఏటా సాగు పెట్టుబడి కోసం వారు ఇబ్బంది పడకుండా ఎంతో కొంత సహాయం చేయాలని, రూ.13,500 చొప్పున ఇస్తూ, ఈ పథకానికి నాంది పలికాం.
► 50 శాతం రైతులు, 70 శాతం రైతులకు (హెక్టారు భూమి ఉన్న వారు) ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ మొత్తం సాగుకు సరిపోతుంది.
చెప్పిన దాని కన్నా ముందుగా.. ఎక్కువగా.. ఎన్నికల ప్రణాళికలో నాలుగేళ్ల పాటు ఏటా రూ,12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా ముందుగా, మెరుగ్గా చేయగలిగాం. నాలుగేళ్లకు బదులు 5 ఏళ్లు, రూ.12,500కు బదులు రూ.13,500 రైతుల చేతిలో పెడుతున్నాం.

మరో నెల రోజులు అవకాశం
► గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిటింగ్‌ కోసం గత నెల 24 నుంచి రైతుల పేర్లు ప్రదర్శించాం. ఎవరికైనా రాకుంటే దరఖాస్తు చేసుకోమని కోరాం. 
► ఈ మూడు వారాల్లో ఎవరైనా దరఖాస్తు చేయకపోతే.. తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, మరో నెల సమయం ఇస్తున్నాం. అర్హులైన వారు ఎవరైనా ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలి. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా ఎలా ఇవ్వాలని మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది.  
► రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా, వెంటనే 1902 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందిస్తాం. ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకులు ఏ రుణ ఖాతాలోనో జమ చేసుకునే వీలు లేదు. 

రైతు భరోసా కేంద్రాలు
► రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బికే)లో రైతులకు విత్తనాలు, పురుగు మందులు, రసాయనాలు విక్రయిస్తారు. వాటి నాణ్యతలో ప్రభుత్వానిదే గ్యారంటీ. నాణ్యతతో కూడిన విత్తనాలు, రసాయనాలు, పురుగు మందులు రైతులకు దొరుకుతాయి.
► ఆర్‌బీకేలలో ఒక కియోస్క్‌ కూడా ఉంటుంది. అక్కడ ఉండే వ్యక్తి రైతులకు పూర్తిగా సలహాలు ఇస్తారు. ఏ పంట వేస్తే బాగుంటుంది.. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితి వంటివి వివరిస్తారు. అక్కడే ల్యాబ్‌ ఉంటుంది. భూసార నాణ్యతను పరీక్షిస్తారు. గ్రామ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి.
► రైతుల పంటలపై ఈక్రాపింగ్‌ ఉంటుంది. రైతులకు అవసరమైన రుణాలు ఇప్పించడంతోపాటు, వారికి బీమా ప్రక్రియను కూడా ఆర్‌బీకేలే చూస్తాయి. తుదకు రైతులకు గిట్టుబాటు ధరల కల్పనలో కూడా ఆర్‌బీకేలు పని చేస్తాయి. వాటిలో ఉండే వ్యవసాయ సహాయకులు ఈ పనులన్నీ చేస్తారు.
► పంటలు, వాటి ధరలకు సంబంధించి బయటి పరిస్థితి విశ్లేషించి రోజూ నివేదిస్తాడు. అవసరమైతే మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.


రైతుల కోసం పలు కార్యక్రమాలు
► గతేడాది నుంచి రైతుల కోసం ఎన్నో పనులు చేశాం. కౌలు రైతుల మేలు కోసం కౌలుదారీ చట్టంలో సవరణ చేశాం. వైఎస్సార్‌ రైతు బీమాలో ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. 2012–13కు సంబంధించి బీమా రాకపోతే రూ.112 కోట్లు ఇచ్చాం. శనగ రైతులను ఆదుకోవడం కోసం రూ.300 కోట్లు ఖర్చు చేశాం.
► రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఈ మొత్తం నుంచి కరోనా సమయంలో మార్చి 24 నుంచి ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించగలిగాం. పసుపు, పూల రైతులను కూడా ఆదుకున్నాం, పొగాకు రైతులకూ మేలు చేశాం.
► ఆర్‌బీకేల ద్వారా ఇవన్నీ ఇంకా గొప్పగా చేయాలని అందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ ఖరీఫ్‌ నాటికి 82 శాతం ఫీడర్ల ద్వారా రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నాం. ఫీడర్ల కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం.
► ఆత్మహత్య చేసుకున్న 434 రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం. రైతుల కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సలహా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
► మార్కెటింగ్‌ శాఖను ఇంకా బలోపేతం చేస్తూ, వచ్చే ఏడాది నుంచి ప్రతి గ్రామ సచివాలయం వద్ద వైఎస్సార్‌ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ అన్ని వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతాయి. ఆ విధంగా రైతుల ఉత్పత్తులలో కనీసం 30 శాతం స్థానిక మార్కెట్‌ ఉంటుంది. గతంలో రాష్ట్రంలో 150 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే, మా ప్రభుత్వం వచ్చాక ఆ ఉత్పత్తి 172 లక్షల టన్నులకు పెరిగింది. మంచి మనసు ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. అందరికీ మరింతగా మంచి చేసే అవకాశం కల్పించాలి. 
  
తొలి విడతగా రూ.3,575 కోట్లు
► వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం చేస్తున్నారు. గత నెలలో రూ.2 వేలు తీసుకోని వారికి ఆ మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఒకేసారి రూ.7500 చొప్పున రైతులకు మొత్తం రూ.3675 కోట్లు ఇస్తున్నారు.
► ల్యాప్‌టాప్‌లో సీఎం బటన్‌ నొక్కగానే ఒకేసారి 49,43,590 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. అనంతరం ప్రజా సంకల్ప యాత్ర విజువల్స్‌ ప్రదర్శించారు. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల్లో కలెక్టర్లు, రైతులతో సీఎం జగన్‌ మాట్లాడారు. 
► కార్యక్రమంలో తొలుత ప్రజా సంకల్ప యాత్రలో విజువల్స్‌తో పాటు, వైఎస్సార్‌ విజువల్స్‌తో వీడియో ప్రదర్శించారు. రైతు భరోసా పథకంపై సీఎం జగన్‌ ప్రసంగాన్ని ఆ వీడియోలో పొందుపర్చారు. 

ఇంకా మంచిగా పంటలు పండిస్తాం 
మాది కరువు జిల్లా. అయినా కష్టపడి సాగు చేసుకుంటున్నాం. నాడు పెద్దాయన వైఎస్సార్‌ పాదయాత్రలో రైతుల కష్టాలు చూశారు. హంద్రీ–నీవా ద్వారా నీరు తెప్పించారు. రుణమాఫీ కూడా చేశారు. రైతులను రాజుగా చూడాలని చాలా పట్టుదలగా పని చేశారు. ఆయన అకాల మరణం మమ్మల్ని క్షోభకు గురి చేసింది. గత పాలకులు రెయిన్‌ గన్లు అంటూ కోట్లు ఖర్చు చేశారు. ఏ మాత్రం ప్రయోజనం కలగలేదు. మీరు పాదయాత్రలో మా కష్టాలు చూశారు. అందుకే ఇప్పుడు మాకు మేలు చేసేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. మీ మాటలు మాకెంతో ఉత్సాహం ఇస్తున్నాయి. ఇంకా మంచిగా పంటలు  పండిస్తాం. మాకు విత్తనాలు, ఎరువుల సేకరణ కూడా చాలా కష్టం. కానీ మీరు ఆ బాధ్యత తీసుకుని, మాకు ఎంతో మేలు చేస్తున్నారు. మీరు మా జిల్లా మనవడు. మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.
    – కె.నాగరాజు, ముకుందాపురం, గార్లదిన్నె, అనంతపురం

గత ఏడాది 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,534 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు 49.43 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నాం. గత నెలలో రూ.2 వేలు ఇచ్చాం. ఇప్పుడు మిగిలిన రూ.5,500 ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆలయాల భూములు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా సహాయం చేస్తున్నాం. 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు బాధగా ఉంది. బహిరంగ సభలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం చేయాలని ఉవ్విళ్లూరాను. అయితే కరోనా కారణంగా ఇలా తప్పడం లేదు. అందరికీ అన్నం పెట్టే రైతులకు ఎంత చేసినా తక్కువే. రైతులకు ఇంకా మంచి జరగాలని.. వారికి సేవ చేసే అవకాశం మరింత రావాలని కోరుకుంటున్నాను.

ప్రతి విషయంలో రైతుకు మంచి జరగాలని ఈ ప్రభుత్వం పరితపిస్తోంది. అందులో భాగంగా ఈనెల 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. మొత్తం 11,600 గ్రామ సచివాలయాలు ఉంటే, 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. ఆ రోజుకు మన ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement