ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్
ఎంఎస్‌ఎంఈల్లో దాదాపు 2.80 లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తుండగా, వారు వెళ్లిపోయారు. అదే సమయంలో మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి 1.30 లక్షల మంది వచ్చారు. స్కిల్ గ్యాప్ రాకుండా వారికి శిక్షణ ఇవ్వడంపై అధికారులు దృష్టిపెట్టాలి.
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఎగ్గొట్టిన బకాయిలు రూ.828 కోట్లు. 2014–15లో 43 కోట్లు, 2015–16లో 70 కోట్లు, 2016–17లో 195 కోట్లు, 2017–18లో 207 కోట్లు, 2018–19లో 313 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో బకాయిలు రూ.77 కోట్లు. అన్నీ కలిపి రూ.905 కోట్లు మంజూరు చేశాం. ఇవాళ రూ.450 కోట్లు ఇస్తున్నాం. మిగిలినవి జూన్ 29న ఇస్తాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు వేళ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఊరట కల్పించారు. వీటికి రూ.1,110 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాల్లో తొలి విడతగా రూ.450 కోట్లను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. రెండో విడతగా మిగిలిన బకాయిలను జూన్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల్లోని ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఎంఎస్‌ఎంఈలు 10 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయని.. నిరుద్యోగం పెరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ వెల్లడించారు. మూడు నెలలకు సంబంధించి కరెంటు ఫిక్స్‌డ్ ఛార్జీలు రద్దుచేశామని, తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేశామన్నారు. అంతేకాక.. దాదాపు రూ.10 లక్షల వరకు రుణాలను 6–8 శాతం తక్కువ వడ్డీకే ఇస్తామని, ఈ రుణాలపై ఆరు నెలల మారిటోరియమ్ ఉంటుందని కూడా సీఎం వివరించారు. దీంతో.. గత సర్కారు చెల్లించని బకాయిలు ఇవ్వడం, విద్యుత్ ఛార్జీల రద్దు నిర్ణయంపై ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
పరిశ్రమల శాఖ రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చిన్న పరిశ్రమల నుంచే 25 శాతం కొనుగోళ్లు
ప్రభుత్వానికి అవసరమైన 25 శాతం వస్తువులు, సామాగ్రి మొత్తం 360 రకాలను ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలి. అందులో కూడా 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్‌ఎంఈలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలి. వీరికి కచ్చితంగా 45 రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం.
మూడో జేసీకి బాధ్యతలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందువల్ల జిల్లాల్లో మూడో జేసీకి వీటి బాధ్యతను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. జిల్లాల్లో ఈ పరిశ్రమల అవసరాలు గుర్తించాలని, యువతలో వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కోరాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.
ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోవాలి
► రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు దాదాపు 98 వేలు ఉంటే, వాటిలో 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైవేటు రంగంలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఈ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది. వాటిని కాపాడుకోలేకపోతే నిరుద్యోగ సమస్యను అధిగమించలేం. ప్రభుత్వం తోడు ఉంటే తప్ప అవి మనుగడ కొనసాగించలేవు. అందుకే వీటిపై శ్రద్ధ పెట్టమని కలెక్టర్లను కోరుతున్నా. లాక్‌డౌన్ వల్ల ఈ రంగం కుదేలైంది. దీనిని నిలబెట్టుకోకపోతే, సమస్యలు పెరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగానికి చెందిన ప్రోత్సాహకాలను పట్టించుకోలేదు. చిన్నచిన్న వారితో పరిశ్రమలు పెట్టించి, వారికి ఏ రకమైన ఆర్థిక సహాయం చేయకపోవడంతో వారు చితికిపోయారు.
ఈ అంశాలూ దృష్టిలో పెట్టుకోండి
► ఈ పరిశ్రమలను మీరు (కలెక్టర్లు) మానిటర్ చేసేటప్పుడు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో స్కిల్ గ్యాప్స్ ఉంటే ఏం చేయవచ్చో ఆలోచించండి. గ్రామ, వార్డు వలంటీర్లను ఉపయోగించుకోండి. ఎవరైనా అర్హులుంటే గుర్తించండి.
► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నాం. వాటికి కావాల్సిన మ్యాన్‌పవర్, స్కిల్డ్ మ్యాన్‌పవర్‌కు అనుగుణంగా, తగిన ఆలోచన చేయండి. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో శిక్షణనిచ్చి, పరిశ్రమల అవసరాలు తీర్చాలి.
► చివరగా.. దేవుడి ఆశీస్సులతో పరిశ్రమలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగం ముగించారు. అనంతరం కంప్యూటర్‌లో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ప్రచురించిన సమాచార బ్రోచర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్నితో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకున్నా సరే ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ఉదారంగా ముందుకొచ్చాం. ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ రంగం బాధ్యతలను మూడో జేసీకి అప్పగిస్తున్నాం. జిల్లాల్లో పరిశ్రమల అవసరాలు గుర్తించాలి. వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, రాష్ట్రంలో 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
10లక్షల మందికి మేలు
► కరోనా సమయంలో చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి కాబట్టి వాటికి ఇంకా ఏం చేస్తే అవి తమ కాళ్ల మీద నిలబడతాయో ఆలోచించి.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కరెంటు ఫిక్స్‌డ్ ఛార్జీలు దాదాపు రూ.188 కోట్లు మాఫీ చేస్తున్నాం. ఆ మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 97,428 పరిశ్రమలు.. వాటిలో పనిచేస్తున్న 10 లక్షల మందికి మేలు జరుగుతుందని మనసా వాచా నమ్ముతున్నాం.
► అలాగే, తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేయాలని.. దాదాపు రూ.10 లక్షల వరకు 6–8 శాతం వడ్డీపై రుణాలు ఇవ్వాలని.. ఆరు నెలల మారిటోరియమ్ పీరియడ్ పోనూ, మూడేళ్ల కాలంలో ఆ మొత్తం చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం.
► కలెక్టర్లు కూడా చొరవ చూపి, ఒక జేసీకి ఎంఎస్‌ఎంఈల బాధ్యత అప్పగించాలి. ఆయనకు ఇక్కడ మంచి మంత్రితో పాటు మంచి అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment