వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్
‘మోసాలకు తావు లేకుండా, లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఈ విషయం అందరికీ తెలియాల్సి ఉంది. ఇంత ఇస్తేనే.. నీకు జీతం ఇస్తామనే మోసపూరిత పనులకు చెక్ పెడుతున్నాం.’
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: లంచాలు, మోసాలకు చెక్ పెట్టి.. పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చేందుకే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘స్పందన’పై మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ముందు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ ఎంప్లాయిస్ (ఆప్‌కాస్) వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్నదే కార్పొరేషన్ ఉద్దేశమని తెలిపారు. సకాలంలో పూర్తిగా జీతాలు వచ్చేలా చూడడంతో పాటు.. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.
రూ.30 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగాలు భర్తీ
నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాలను ఔట్ సోర్స్ కార్పొరేషన్ కింద భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్ నుంచి జిల్లా స్థాయి వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఈ కార్పొరేషన్ ద్వారానే జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని, జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్ కన్వీనర్గా వ్యవహరిస్తారని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయ స్థాయిలో సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని, సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీ కన్వీనర్గా ఉంటారని పేర్కొన్నారు.
డిసెంబరు 15లోగా ప్రక్రియను పూర్తి చేసి, జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఒక కోడ్ నంబర్ ఇస్తారని, ప్రతి కాంట్రాక్టును ఒక కేటగిరీగా తీసుకుని.. అందులో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఇస్తారన్నారు. మొత్తంగా 50 శాతం ఉద్యోగాలు మహిళలకు ఇస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాకే అధికారులు జీతం తీసుకునే స్థాయిలోకి రావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment