outsourcing jobs
-
కాంగ్రెస్ కార్యకర్తలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఔట్సో ర్సింగ్ ఉద్యోగాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ హామీ ఇచ్చారు. బాన్సువాడలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చారన్నారు. ప్రస్తుతం అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోస్టులు పంచుకున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. ఒక్కో పోస్టు రూ.50 వేలు?
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ 18, బీజేపీ 5, కాంగ్రెస్ 5 ఇవేవో ఎన్నికల ఫలితాలు అనుకుంటే పొరపాటే.. భువనగిరి మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉద్యోగాలను ఆయా పార్టీలు పంచుకున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పొరుగుసేవల ఉద్యోగుల భర్తీ కోసం ఒక్కటయ్యారు. అధికార పార్టీకి ఉన్న 18 మంది కౌన్సిలర్లు ఒక్కొక్కరు చొప్పున, బీజేపీ, కాంగ్రెస్‌లు కౌన్సిలర్లతో సంబంధం లేకుండా ఐదుగురు చొప్పున తమకు నచ్చిన వారిని నియమించుకోవాలని అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందులో కొందరు కౌన్సిలర్లు ఉద్యోగాలు పెట్టిస్తామని సదరు నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయం బయటకు పొక్కడంతో సోమవారం హడావుడిగా ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. చేయాల్సిన పనులు: మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చడం, డ్రెయినేజీలను శుభ్రం చేయుట, చెత్త సేకరణ ఇతరత్రా పారిశుద్ధ్య పనులు చేయడానికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 9 మంది మహిళలు, 19 మంది పురుషులు మొ త్తం 28 మందిని నియమించుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగినవారు ధరఖాస్తు చేసుకోవా లని ఉపాధి కల్పన అధికారి శాంతిశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) నియామక ప్రకటన ఇదీ పారిశుద్ధ్య పోస్టుల్లో నియామకం కోసం ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్సున్నవారు అర్హులు. అనుభవం అవసరం లేదు. అరోగ్యవంతులై ఉండాలి. అభ్యర్థులు భువనగిరికి చెందిన వారే అర్హులు. నెలకు రూ.15,600 పారి తోషకం చెల్లిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, కలెక్టరేట్లోని తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ (టీమ్) ఆఫీస్‌లో ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 లోపు అందజేయాలి. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు మున్సిపాలిటీలో పొరుగు సేవల ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే డబ్బుల వసూళ్లు ప్రారంభించారు. 28 పోస్టులను పార్టీల వారీగా పంచుకున్న వెంటనే కొందరు కౌన్సిలర్లు అశావహుల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో పక్క ఉద్యోగాల కోసం వసూళ్లు అంటూ ప్రచారం జరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా) -
ఔట్సోర్సింగ్: టీడీపీ పచ్చి అబద్ధాలు చెప్తోంది
సాక్షి, అమరావతి: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో టీడీపీ సభ్యులు చేస్తున్న రాద్ధాంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభలో పచ్చి అబద్ధాలు చెప్తోందని ఆయన మండిపడ్డారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసే గొప్ప ఆలోచనతో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సౌర్సింగ్ సర్సీసెస్‌ను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఆఖరికీ ఉద్యోగులు జీతాలు పొందాలన్న లంచం ఇవ్వాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితి ఉండకూడదని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోకూడదని, వారికి పూర్తి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. గత చంద్రబాబు హయాంతో ఆయన బంధువు భాస్కర్ నాయుడికి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు సంబంధించిన వాళ్లకే గత హయాంలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు ఇచ్చి ఇష్టానుసారంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా, వారికి పూర్తిగా లబ్ధి చేకూర్చేందుకు, లంచాలకు తావులేకుండా పూర్తి జీతాలు అందించేందుకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చే సదుద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను తీసుకొచ్చామని, ఈ విషయంలోనూ టీడీపీ బురద జల్లుతూ, రాజకీయం చేస్తూ.. దిక్కుమాలిన అబద్ధాలు చేస్తోందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవుట్సోర్సింగ్కు అనిశ్చితి ముప్పు
బెంగళూరు: అంతర్జాతీయ అవుట్సోర్సింగ్ మార్కెట్‌కు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిపరమైన ముప్పు పొంచి ఉందని రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ పేర్కొంది. కంపెనీలు సాధ్యమైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వనరుల మేళవింపుతో కంపెనీలు అనుసరిస్తున్న విధానంతో డిమాండ్, సరఫరాపరంగా కొన్నాళ్లుగా విదేశీ అవుట్సోర్సింగ్ మార్కెట్ స్థిరంగా ఉంటోందని గార్ట్నర్ తెలిపింది. అయితే, శ్రీలంకలో ఉగ్రవాద దాడులు, అమెరికా–చైనా మధ్య వాణిజ్య వివాదం, హాంకాంగ్‌లో రాజకీయ ఆందోళనలు మొదలైన వాటితో సరఫరాపరమైన అనిశ్చితి తలెత్తిందని ఒక నివేదికలో వివరించింది. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ మొదలైన దేశాలకు చైనా దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువ చేసే ఐటీ అప్లికేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసులు అందిస్తోంది. భారతీయ అవుట్సోర్సింగ్ సంస్థలు .. అంతర్జాతీయంగా సేవల ద్వారా గతేడాది 45 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. అయితే, తాజాగా వాణిజ్య యుద్ధంపై ఆందోళనలతో ఐటీ సేవల విషయంలో చైనాకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చని గార్ట్నర్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆఫ్‌షోర్ అవుట్సోర్సింగ్ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవడం శ్రేయస్కరమని సూచించింది. -
జనవరి లేదా ఫిబ్రవరిలో ‘స్థానిక’ ఎన్నికలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 2020, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుంది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు మంత్రులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పారదర్శకంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పూర్తిగా అంతరిస్తుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు, ఐఏఎస్ హోదా గల కార్యదర్శులకు కట్టబెట్టారు. ఈ ఎంపిక విధానంలో రాజకీయ జోక్యం వద్దని సీఎం సూచించారు. ఇసుకపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి ఇసుకపై రాజకీయం చేస్తూ దీక్షకు పూనుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సీఎం మంత్రులను కోరారు. ఓ వైపు ఇసుక లేదు.. తీయడం లేదంటూ.. మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేశారని చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మనం అమల్లోకి తెస్తున్న ఇసుక విధానంలో ఎవరైనా ఇసుక దోపిడీకి పాల్పడితే.. ఏ పార్టీ వారనేది చూడకుండా కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు. పూర్తి పారదర్శకత కోసం జిల్లాల వారీగా ఇసుక రేట్లను జిల్లా కలెక్టర్లు ప్రకటించాలని ఆదేశించారు. కాగా, ఇసుకపై టీడీపీ విడుదల చేసిన చార్జిషీట్ ఓ తప్పులతడకని, అబద్ధాలమయం అని మంత్రులంతా అభిప్రాయపడ్డారని తెలిసింది. ధనికుల పిల్లలకేనా ఇంగ్లిష్? ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను సీఎం వైఎస్ జగన్ మరోమారు గట్టిగా సమర్థించారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య రాసిన ఒక వ్యాసాన్ని ఆయన ఉదహరించారని తెలిసింది. ఇంగ్లిష్ ధనికులు, అగ్రవర్గాల వారి పిల్లలకేనా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఆంగ్ల భాషను ఒక్కసారిగా రుద్దడం లేదని 1 నుంచి 6వ తరగతి వరకూ ప్రవేశపెడితే పదో తరగతికి వచ్చే నాటికి పిల్లలు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని బాగా పెంచుకుంటారని అభిప్రాయపడ్డారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులతో మన విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అన్నారు. తెలుగు లేకుండా చేస్తున్నారనే విమర్శలను ప్రస్తావిస్తూ... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, రామోజీరావు సతీమణి, టీడీపీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమే ఉందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని ఎలా అంటారని ప్రశ్నించినట్టు తెలిసింది. నెలాఖరుకు మార్కెటింగ్, దేవాలయ కమిటీల పాలకవర్గాలు ఇన్చార్జ్ మంత్రులు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా ఏదో ఒక తేదీలో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ఆ రోజు ఎమ్మెల్యేలందరినీ కలుసుకోవడమే కాకుండా వారి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. నెలాఖరుకు మార్కెటింగ్ కమిటీలు, దేవాలయ కమిటీల పాలక వర్గాల నియామకాలు జరిగి తీరాలని.. ఈ పదవుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు. కాగా, రూ.2.50 కోట్లు ఆదాయం మించిన 8 దేవస్థానాలకు టీటీడీ తరహాలో ట్రస్టు బోర్డులను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
లంచాలు, మోసాలకు చెక్
‘మోసాలకు తావు లేకుండా, లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఈ విషయం అందరికీ తెలియాల్సి ఉంది. ఇంత ఇస్తేనే.. నీకు జీతం ఇస్తామనే మోసపూరిత పనులకు చెక్ పెడుతున్నాం.’ – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: లంచాలు, మోసాలకు చెక్ పెట్టి.. పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చేందుకే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ‘స్పందన’పై మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు ముందు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ ఎంప్లాయిస్ (ఆప్కాస్) వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్నదే కార్పొరేషన్ ఉద్దేశమని తెలిపారు. సకాలంలో పూర్తిగా జీతాలు వచ్చేలా చూడడంతో పాటు.. పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. రూ.30 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగాలు భర్తీ నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాలను ఔట్ సోర్స్ కార్పొరేషన్ కింద భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్ నుంచి జిల్లా స్థాయి వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఈ కార్పొరేషన్ ద్వారానే జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని, జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయ స్థాయిలో సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని, సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు. డిసెంబరు 15లోగా ప్రక్రియను పూర్తి చేసి, జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఒక కోడ్ నంబర్ ఇస్తారని, ప్రతి కాంట్రాక్టును ఒక కేటగిరీగా తీసుకుని.. అందులో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఇస్తారన్నారు. మొత్తంగా 50 శాతం ఉద్యోగాలు మహిళలకు ఇస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాకే అధికారులు జీతం తీసుకునే స్థాయిలోకి రావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. -
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ ఎంప్లాయిస్ (ఏపీ ఆప్కాస్) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ప్లేస్మెంట్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి కోడ్ నెంబర్ ఉంటుందని, ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటీటీగా తీసుకోవాలని సీఎం సూచించారు. మధ్యవర్తులు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగేందుకు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్ పరిధిలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూదని చెప్పారు. లంచాలు, మోసాలకు తావులేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50శాతం కల్పిస్టున్నట్టు సీఎం తెలిపారు. జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు వచ్చేలా చూసేందుకు ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా ఉంటారని, జిల్లా కమిటీకి ఆయా కలెక్టర్లు నేతృత్వం వహిస్తారని తెలిపారు. -
50 శాతం రిజర్వేషన్లు
-
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50%
-
మరో కీలక హామీ అమలు దిశగా సీఎం జగన్
సాక్షి, అమరావతి: మరో కీలక హామీ అమలు దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మొత్తంగా 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్ష మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరు ఆయా ఏజెన్సీల ద్వారా నియామకం అవుతున్నారు. ఈ నియామకాల్లో అందరికీ అవకాశాలు దక్కడం లేదు. మరోవైపు పనికి తగినట్టుగా జీతం పూర్తి స్థాయిలో లభించకపోవడం, సకాలంలో జీతాలు రాకపోవడం లాంటి సమస్యలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు నచ్చిన రీతిలో నియామకాలను చేపడుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం కార్పొరేషన్ ఏర్పాటవుతోంది. ఈ అంశాలపై సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సాధారణ పరిపాలనాశాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ పని చేస్తుంది. దీనికి అనుబంధంగా జిల్లాల స్థాయిలో విభాగాలుంటాయి. జిల్లా ఇన్చార్జి మంత్రులు ఈ విభాగాలకు నేతృత్వం వహిస్తారు. జిల్లా కలెక్టర్లు కార్పొరేషన్‌కు ఎక్స్ అఫిషియోలుగా వ్యవహరిస్తారు ముఖ్యాంశాలు, ఉపయోగాలు - రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సర్వీసులను కొత్తగా ఏర్పాటవుతున్న ఈ కార్పొరేషన్‌కు, దీని కింద జిల్లాల్లో ఉన్న విభాగాలకు నివేదిస్తాయి. - ఒక వెబ్ పోర్టల్ ద్వారా అవుట్ సోర్సింగ్ నియామకాలను చేపడతారు. - అక్టోబరు 16న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. - డిసెంబర్ 1 నుంచి కార్పొరేషన్ పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. - ఎలాంటి దళారీలు లేదా ఏజెన్సీలు లేకుండా నేరుగా ఈ కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పొందే అవకాశం ఏర్పడుతుంది. - మహిళలకు, సమాజంలో అట్టడుగు వర్గాలకూ సముచిత ప్రాధాన్యం దక్కుతుంది. - ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న వారికి ఒకే పనికి ఒకే రకమైన జీతం లభిస్తుంది. - ఎలాంటి ఆలస్యం జరక్కుండా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. -
డీఎంహెచ్ఓలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నేడు కౌన్సెలింగ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి ఈనెల 19న శివరాంపల్లిలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఆరు స్టాఫ్‌నర్స్, నాలుగు ఫా ర్మాసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, నాలు గు ఏఎన్ఎం, మూడు అకౌంటెంట్ పో స్టులు భర్తీ చేస్తామన్నారు. తాత్కాలికం గా ఎంపికైన వారి వివరాలు జిల్లా వెబ్సైట్లో పెట్టామన్నారు. ఆయా అభ్యర్థులు ఉదయం 11 గంటలకల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో అన్ని ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలన్నారు. -
తవ్వేకొద్ది అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘అవుట్సోర్సింగ్’ అక్రమాలు జిల్లాలో తవ్వేకొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గడువు ముగిసినా.. అధికారులు పది నెలలుగా పాత ఏజెన్సీలనే కొనసాగిస్తుండటం వెనుక పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ అక్రమాల వెనుక రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అవుట్సోర్సింగ్ అక్రమ నియామకాల అంశం ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాజ య్య పదవికే ఎసరు పెట్టగా, జిల్లాలో కూడా అదే స్థాయిలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. టెండరు ప్రక్రియలో అధికారుల జిమ్మిక్కులు.. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో సుమారు 1,500 నుంచి రెండు వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.కోట్లలో జీతభత్యాలతోపాటు, వీరిని సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు రూ.లక్షల్లో ప్రభుత్వం చార్జీలను చెల్లిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఐదు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి గఫార్ తెలిపారు. ఈ ఏజెన్సీల గడవు 2014 మార్చి 31తోనే ముగిసింది. దీంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2014-15 గాను ఈ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు కలెక్టర్ ఎం.జగన్మోహన్ ఓ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.రాజు నేతృత్వంలోని ఈ కమిటీ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియకు 2014 జూన్‌లో శ్రీకారం చుట్టింది. ఆ నెలలో టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 ఏజెన్సీలు టెండర్లలో పాల్గొన్నాయి. నిర్ణీత తేదీలోగా ఈ టెండర్లను ఓపెన్ చేయాల్సిన అధికారులు కావాలనే జాప్యం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ‘పని ఒత్తిడి’ని సాకుగా చూపి ఈ పక్రియను వాయిదా వేశారు. ఆ తర్వాత టెండర్ల జోలికే వెళ్లలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తున్నా, పదినెలల కాలంగా పాత ఏజెన్సీలకే కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ టెండర్ల ప్రక్రియను యథాతథ స్థితిలో కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని, న్యాయస్థానం ఆదేశాల మేరకే అవుట్సోర్సింగ్ ఎంపిక ప్రక్రియను నిలిపివేశామని ఎంపిక కమిటీ కన్వీనర్ గఫార్ ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్ణీత తేదీలోగా టెండర్లు ఎందుకు తెరవలేదని ప్రశ్నించగా అది.. జిల్లా ఉన్నతాధికారులకు తెలుసని చెప్పుకొచ్చారు. అవుట్సోర్సింగ్ అక్రమాలపై చర్యలేవీ..? జిల్లాలో కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయి. తమ ఉద్యోగుల జీతభత్యాల్లో ఒక్కో ఉద్యోగి వద్ద రూ.వేలల్లో కోత పెడుతూ ప్రతినెలా రూ.లక్షలు దండుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొందరు బాధితులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, అధికారులు మాత్రం ఏ ఒక్క ఏజెన్సీపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవంటే.. అధికారులు ఆయా ఏజెన్సీలకు ఏ మేరకు సహకరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ అక్రమ నియామకాల వ్యవహారంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యపైనే బర్తరఫ్ వేటు వేసిన ప్రభుత్వం.. జిల్లాలో జరుగుతున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలపై ఎందుకు దృష్టిసారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టిన పక్షంలో ఈ వ్యవహారం జిల్లా ఉన్నతాధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిరుద్యోగుల బలహీనతే... ఇంధనం
సర్కారీ కొలువు సంపాదిస్తే ఆ సంతోషమే వేరబ్బా... ఇది నిరుద్యోగుల అంతరంగంలో గూడుకట్టుకున్న బలహీనత. ఇదే దళారులకు అయాచిత వరంగా మారింది. ప్రభుత్వం ఏదైనా కొలువుల నోటిఫికేషన్ విడుదల చేసిందే తడవుగా రంగంలోకి దిగి పోతున్నారు. దళారులను నమ్మవద్దని..ఉద్యోగాలు పారదర్శకంగానే భర్తీచేస్తామని ఓవైపు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ నిరుద్యోగులు మాత్రం గుడ్డిగా వారినే నమ్ముతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా వీఆర్ఓ,వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇప్పుడు దళారులకు సంక్రాంతికి ముందే పండగ సీజన్ వచ్చేసింది. నిరుద్యోగుల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లిమర్ల, న్యూస్‌లైన్:నెల్లిమర్ల నగరపంచాయతీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని స్థానికనేత ఒకరు సుమారు 20మంది నుంచి తలా రూ.50 వేల చొప్పున మొత్తం వసూలు చేశారు. డబ్బులు వసూలుచేసి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఆ ఉద్యోగాలకు అతీగతీ లేకపోవడంతో డబ్బులు ముట్టజెప్పిన నిరుద్యోగులు కక్కలేక.. మింగలేక అన్నట్లు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. అలాగే గత ఏడాది జూలైలో గుర్ల మండలం రౌతుపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిరుద్యోగులనుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ నేత ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తలా రెండులక్షలు చొప్పున కాజేశాడు. ఇప్పటిదాకా ఉద్యోగాలు వేయించక పోవడంతో బాధితులు సదరు నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిం చేందుకు సన్నద్ధమవుతున్నారు. అదే మండ లం పల్లిగండ్రేడు గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగినుంచి అధికారపార్టీ నేత ఒకరు వీఆర్ఓ ఉద్యోగం వేయిస్తానని చెప్పి సుమారు ఏడాది క్రితం లక్షరూపాయలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా అదే పరిస్థితి. స్థానిక నేతలను నమ్మి వీరే గాదు జిల్లాలోని వందలాదిమంది నిరుద్యోగులు ఇలాగే మోసపోతున్నారు. ఇప్పటిదాకా హోంగార్డులుగానూ, వీఆర్వోలుగానూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగానూ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలికి పలువురు చోటా రాజకీయ దళారులు వందలాదిమందిని మోసం చేశారు. నేతలను నమ్మి డబ్బులు అప్పజెప్పిన నిరుద్యోగులు మాత్రం తాము మోసపోయిన విషయాన్ని ఇప్పటికీ బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కొత్తగా దళారులు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ అండదండలున్నవారే ఈ అవతారమెత్తుతున్నట్లు సమాచారం. నిన్నమొన్నటిదాకా పలు విభాగాల్లో ఉద్యోగాలు వేయిస్తామని డబ్బులు గుంజిన దళారులు ఇప్పుడు వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ దండుకునేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు సంబంధించి తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 137వీఆర్ఏ, 90 వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారుల సమాచారం మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 28న పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నేతలు నిరుద్యోగుల తల్లిదండ్రులకు నమ్మబలుకుతున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అనుచరులే ఈ విధంగా నమ్మిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో పోస్టు ఇప్పించేందుకు రూ ఐదు లక్షలదాకా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే వీఆర్ఏ పోస్టుకు రూ.రెండులక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరి కొంతమంది దళారులు ఓ అడుగు ముందుకేసి డబ్బులు ఇచ్చినా..టెస్ట్‌కు బాగా ప్రిపేర్ అవ్వాలని ఉచిత సలహాలు కూడా పారేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఒకవేళ అభ్యర్థి ప్రతిభతో ఉద్యోగం వచ్చినా తమకిచ్చిన డబ్బు నొక్కేయవచ్చుననే ఉద్దేశంతోనే ఇలా చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం పదిమంది దగ్గర డబ్బులు వసూలుచేస్తే వారిలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా రూ.ఐదులక్షలు సంపాదించుకోవచ్చని, మిగిలిన వారి సొమ్ములో ఖర్చుల నిమిత్తం కొంతమొత్తం ఉంచేసుకోవచ్చని ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఈ విషయాలేవీ తెలియని నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు మాత్రం అమాయకంగా నేతలను నమ్మి డబ్బు ముట్టజెబుతున్నారు. తమకు రావాల్సిన ఉద్యోగం ఎక్కడ చేజారిపోతుందోనని డబ్బు ముట్టజెప్పడంలో పోటీకూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు పట్టించుకుని నిరుద్యోగులను మరింత చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.