ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 2020, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుంది. బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు మంత్రులకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి..
పారదర్శకంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పూర్తిగా అంతరిస్తుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు, ఐఏఎస్ హోదా గల కార్యదర్శులకు కట్టబెట్టారు. ఈ ఎంపిక విధానంలో రాజకీయ జోక్యం వద్దని సీఎం సూచించారు.
ఇసుకపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి
ఇసుకపై రాజకీయం చేస్తూ దీక్షకు పూనుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సీఎం మంత్రులను కోరారు. ఓ వైపు ఇసుక లేదు.. తీయడం లేదంటూ.. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేశారని చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మనం అమల్లోకి తెస్తున్న ఇసుక విధానంలో ఎవరైనా ఇసుక దోపిడీకి పాల్పడితే.. ఏ పార్టీ వారనేది చూడకుండా కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు. పూర్తి పారదర్శకత కోసం జిల్లాల వారీగా ఇసుక రేట్లను జిల్లా కలెక్టర్లు ప్రకటించాలని ఆదేశించారు. కాగా, ఇసుకపై టీడీపీ విడుదల చేసిన చార్జిషీట్ ఓ తప్పులతడకని, అబద్ధాలమయం అని మంత్రులంతా అభిప్రాయపడ్డారని తెలిసింది.
ధనికుల పిల్లలకేనా ఇంగ్లిష్?
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను సీఎం వైఎస్ జగన్ మరోమారు గట్టిగా సమర్థించారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య రాసిన ఒక వ్యాసాన్ని ఆయన ఉదహరించారని తెలిసింది. ఇంగ్లిష్ ధనికులు, అగ్రవర్గాల వారి పిల్లలకేనా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలకు అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఆంగ్ల భాషను ఒక్కసారిగా రుద్దడం లేదని 1 నుంచి 6వ తరగతి వరకూ ప్రవేశపెడితే పదో తరగతికి వచ్చే నాటికి పిల్లలు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని బాగా పెంచుకుంటారని అభిప్రాయపడ్డారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులతో మన విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అన్నారు. తెలుగు లేకుండా చేస్తున్నారనే విమర్శలను ప్రస్తావిస్తూ... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, రామోజీరావు సతీమణి, టీడీపీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమే ఉందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని ఎలా అంటారని ప్రశ్నించినట్టు తెలిసింది.
నెలాఖరుకు మార్కెటింగ్, దేవాలయ కమిటీల పాలకవర్గాలు
ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా ఏదో ఒక తేదీలో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ఆ రోజు ఎమ్మెల్యేలందరినీ కలుసుకోవడమే కాకుండా వారి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. నెలాఖరుకు మార్కెటింగ్ కమిటీలు, దేవాలయ కమిటీల పాలక వర్గాల నియామకాలు జరిగి తీరాలని.. ఈ పదవుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు. కాగా, రూ.2.50 కోట్లు ఆదాయం మించిన 8 దేవస్థానాలకు టీటీడీ తరహాలో ట్రస్టు బోర్డులను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment