సాక్షి, అమరావతి: జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా నియమితులైన వారి పనితీరుపై ప్రతి ఆరు నెలలకొకసారి సమీక్ష జరుగుతుందని, వారి సామర్థ్యం ప్రాతిపదికగా మార్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అధికారిక ఎజెండాలోని అంశాలు ముగిశాక, అధికారులు నిష్క్రమించిన అనంతరం ఆయన మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని, ఏవైనా రాజకీయ అంశాలుంటే పరిష్కరించాలని, ప్రతి నెలా తనకు జిల్లా పరిస్థితిపై ఇన్‌చార్జి మంత్రులు నివేదికలు ఇవ్వాలని జగన్ సూచించినట్లు తెలిసింది. తనకు ఎలాగూ నిఘా విభాగం నుంచి కూడా నివేదికలు వస్తాయని, నెలలో కనీసం రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఇన్‌చార్జి మంత్రులు తమకు నిర్దేశించిన జిల్లాలో బస చేయాలని చెప్పినట్లు సమాచారం. స్థానికులు కాని మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించడానికి ప్రధాన కారణం వారు నిష్పాక్షికంగా ఉంటారనే ఉద్దేశంతోనేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ‘ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను రాజకీయంగా బలోపేతం చేయాలి. వారు పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. పనితీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తాం.
ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండండి
మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదని ఎమ్మెల్యేలు, ఇతరుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అందువల్ల కచ్చితంగా వారు అందరికీ అందుబాటులో ఉండి తీరాలని జగన్ సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు ఆదివారం సెలవు కనుక నియోజకవర్గాలకు వెళ్తామని, సోమవారానికి సచివాలయానికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని అందువల్ల మంగళ, బుధవారాల్లో అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తామని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారని తెలిసింది. దీంతో ఇకపై మంగళ, బుధవారాల్లో కచ్చితంగా మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం నిర్దేశించారని సమాచారం.
నవంబర్‌లో మార్కెటింగ్ పదవుల నియామకం పూర్తి
‘నవంబర్ నెలాఖరుకు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, దేవస్థానం, ట్రస్టు పదవుల నియామకం పూర్తి కావాలని.. ఈ పదవుల్లో కచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పాటించి తీరాలి. ఆయా జిల్లాల్లో ఈ పదవుల నియామకం విషయంలో నిర్దేశించిన విధంగా అత్యంత వెనుకబడిన కులాల వారిని సైతం పరిగణనలోకి తీసుకోవాలి. నామినేటెడ్ పదవులన్నింటిలోనూ రిజర్వేషన్లు పాటించాల్సిందే. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు వల్ల దళారీ వ్యవస్థ మధ్యలో ఉండదు. దీంతో ఆ ఉద్యోగులకు మేలు జరుగుతుంది’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆశ్రమ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై ఏటా రూ. 15,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నందున వారిని ‘అమ్మ ఒడి’ పథకం నుంచి మినహాయించాలని ఓ మంత్రి సూచనను సీఎం తోసి పుచ్చినట్లు సమాచారం. ఇసుక కొరతపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలనే అభిప్రాయం మంత్రుల్లో వ్యక్తం అయిందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment