సాక్షి, అమరావతి: ‘త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని నిరోధించాలి. మనం ప్రజల సంక్షేమం కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపడుతూ కూడా ఓట్ల కోసం డబ్బు, మద్యం ఎర వేయడం మంచి పద్ధతి కాదు. ఈ దుష్ట సంప్రదాయానికి ఎక్కడో ఒక చోట ఫుల్‌స్టాప్ పెట్టాలి. ప్రలోభాల ప్రసక్తే లేదు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నొక్కి చెప్పారు. బుధవారం ఆయన తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో చర్చకు వచ్చిన మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
ప్రలోభ పెట్టినట్లు రుజువైతే అనర్హత వేటు
‘డబ్బు, మద్యం వంటి ప్రలోభాలను ఇప్పటి నుంచి ఆపేస్తే సాధారణ ఎన్నికలు వచ్చే నాటికి పూర్తిగా వీటి ప్రభావాన్ని తొలగించవచ్చు. ధనం, మద్యం వెదజల్లి ఎన్నికైన తర్వాత ప్రలోభ పెట్టినట్లు రుజువైతే అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించే విధంగా నిబంధనలను సవరిస్తాం. ఇలాంటి సంస్కరణలు ఆరోగ్యకర వాతావరణానికి దారి తీస్తాయి. అందుకే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేద్దాం’ అని సీఎం చెప్పినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నెగ్గే అవకాశాలపై తాము సర్వే చేయించామని, ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులకు ఈ నివేదికలు అంద జేస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. ఇంచార్జి మంత్రులు, స్థానిక జిల్లాల మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల సమన్వయంతో సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని జగన్ సూచించినట్లు సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు సదరు వ్యక్తి డబ్బు ఖర్చు చేయగలడా? లేదా? అన్నది ప్రాతిపదికగా తీసుకోరాదని, ఎంపిక చేయాలనుకున్న వ్యక్తి పలుకుబడిని, ప్రజాదరణను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం స్పష్టీకరించినట్లు తెలిసింది. ఎన్నికల్లో డబ్బు ప్రాతిపదిక కానప్పుడే మనం సామాన్యులకు పార్టీలో టికెట్లు ఇవ్వగలుగుతామని చెప్పినట్లు సమాచారం.
నిబంధనలు పాటించని అగ్రి కళాశాలలపై చర్యలు
టీడీపీ హయాంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇబ్బడి ముబ్బడిగా వ్యవసాయ కళాశాలలకు అనుమతి ఇచ్చిన విషయం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. అప్పట్లో మంజూరైన కళాశాలలకు సంబంధించి చాలా వాటిలో కనీనం ఉండాల్సినంత వ్యవసాయ భూమి, ప్రయోగశాలలు లేవని కొందరు మంత్రులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. నిబంధనలు పాటించని కళాశాలలను తనిఖీ చేసి, అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. కాగా, ఈ నెల 17వ తేదీ లోపు తెల్లకార్డులు కోల్పోయిన వారికి సంబంధించి తనిఖీ పూర్తి చేసి, నిజంగా అర్హులైన వారికి పునరుద్ధరణ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
పలుకుబడి కలిగిన వారిని ప్రోత్సహించండి
బలవంతులు, ప్రజల్లో పలుకుబడి గల వ్యక్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని, ఇందువల్ల ఎవరి భవిష్యత్తుకూ ఇబ్బంది ఉండదని సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఒక బలమైన అభ్యర్థికి జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే రేపటి శాసనసభ ఎన్నికల్లో తమకు పోటీగా ఎదుగుతారేమోనన్న భయం అక్కరలేదని చెప్పినట్లు తెలిసింది. మార్చి 15వ తేదీ లోపు స్థానిక ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.3,000 కోట్లు వస్తాయని సీఎం వివరించినట్లు సమాచారం. ‘హైకోర్టు తీర్పు వెలువడగానే ఒకదాని వెనుక మరొకటి అన్ని ఎన్నికలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది’ అని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment