ఏపీ: బీసీలకు సాధికారత | BC Associations and Analysts Welcomed CM Jagan Decision | Sakshi
Sakshi News home page

బీసీలకు సాధికారత

Published Mon, Mar 9 2020 3:35 AM | Last Updated on Mon, Mar 9 2020 8:08 AM

BC Associations and Analysts Welcomed CM Jagan Decision - Sakshi

సాక్షి, అమరావతి: ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటే వెనుకంజ వేస్తామా! సాంకేతిక కారణాలతో బీసీలకు తగినంత రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే మిన్నకుండిపోతామా?.. కానే కాదు.. వైఎస్సార్‌సీపీ తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అందిస్తాం..’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. 

దేశంలో తొలి నాయకుడు..
బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను టీడీపీ న్యాయ వివాదాలతో అడ్డుకున్నా సీఎం జగన్‌ వెనుకంజ వేయకుండా, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఇస్తామని వెంటనే నిర్ణయం తీసుకున్నారని బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. దేశంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న తొలి నాయకుడు సీఎం జగన్‌ అని పేర్కొంటున్నాయి. దేశంలోని అన్ని పార్టీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాకారమవుతుందని సూచిస్తున్నాయి. బీసీలను వంచిస్తూ కపట నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోసారి కోలుకోలేని గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయి నుంచి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి దామాషా ప్రకారం రాజకీయ అధికారాన్ని కోరుతున్న బీసీ వర్గాలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. 

బీసీల పక్షపాతి వైఎస్‌ జగన్‌ 
బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధితో వ్యవహరించిన నేతను ఒక్క సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో మాత్రమే చూశామని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల సంక్షేమం, రాజ్యాధికారం దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు వీలుగా మొత్తం రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లోనే జీవో 176 జారీ చేయడం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ నిరీక్షణ ఫలించిందని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఆ జీవోను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టును ఆశ్రయించడం, 59.85 శాతం రిజర్వేషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో బీసీ వర్గాలు తీవ్ర నిస్పృహకు గురయ్యాయి. 

సత్వరమే స్పందించారు..
న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా బీసీలకు చట్టప్రకారం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇలాంటి స్థితిలో మరో నేత ఎవరైనా అధికారంలో ఉంటే సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపించి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీసీల అభ్యున్నతిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. న్యాయపరమైన అంశాల కారణంగా బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నందున పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. 

అద్భుత నిర్ణయం
రిజర్వేషన్లపై కోర్టు కేసులతో కాలయాపన చేయాలన్న టీడీపీ ఎత్తుగడలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ప్రకటించడం అద్భుత నిర్ణయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా గతంలోనే రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టడం బీసీలపట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసు వేయించి ఆ జీవోను అడ్డుకున్నారని విమర్శించారు. మళ్లీ బీసీలను మోసగించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్టీపరంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం ద్వారా బీసీలకు తగిన న్యాయం చేశారని చెప్పారు. 

చిత్తశుద్ధితో అధిగమించిన సీఎం
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ప్రవచించిన స్ఫూర్తిని సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరణలో చూపించారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ బీసీలకు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని, చిత్తశుద్ధితో దీన్ని అధిగమించవచ్చని సీఎం వైఎస్‌ జగన్‌ నిరూపించారని ప్రశంసిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసేవరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న విధాన నిర్ణయాన్ని దేశంలోని ఇతర నేతలు కూడా అనుసరించాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం
– ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
‘పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలాడటం వైఎస్సార్‌సీపీ విధానం కాదు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీల తరపున ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇదే రీతిలో పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణకు కూడా కృషి చేయాలని కోరుతున్నా’ 

తొలి సీఎం జగన్‌..
– జస్టిస్‌ ఈశ్వరయ్య, అఖిల భారత బీసీ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు
‘సామాజిక న్యాయ సాధనలో ముఖ్యమంత్రి జగన్‌ చుక్కానిలా నిలిచారు. దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే. దేశంలో మరే సీఎంగానీ, పార్టీ అధ్యక్షుడుగానీ ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను చొరవను అభినందిస్తున్నాం’

దేశానికి ఆదర్శం..
– హనుమంతు లజపతిరాయ్, మాజీ వీసీ, అంబ్కేడర్‌ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
‘పార్టీపరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం దేశానికి ఆదర్శప్రాయం. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు దీన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాధ్యపడుతుంది’

బీసీ గర్జన హామీ చిత్తశుద్ధితో అమలు..
జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని పదవుల్లోనూ పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే అత్యధికంగా బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. ఎన్నికల ముందు దక్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో బీసీలకు అగ్రస్థానం కట్టబెట్టారు. బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్, బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన మైనార్టీ నేత అంజాద్‌ బాషను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, రోడ్లు–భవనాలు, మార్కెటింగ్, కార్మిక, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖలను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. స్పీకర్‌ పదవికి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా కృషి చేశారు. తాజాగా క్షేత్రస్థాయి నుంచి  రాజ్యాధికారాన్ని అందించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.

రుణపడి ఉంటాం.. 
ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయంతో బీసీ కులాలకు ఎంతో మేలు జరుగుతుంది. టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అండగా నిలుస్తోంది. బీసీలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు. 
– గదుల వెంకట్రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం 

బీసీలకు సముచిత స్థానం
బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు, బడ్జెట్, సీట్ల కేటాయింపులో బీసీలకు సముచిత స్థానం కల్పించి గత 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అమలు చేస్తున్నారు. అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు 
– మహంతి శ్రీరవి, తూర్పుకాపు

అభినందనీయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అదనంగా 10 శాతం సీట్లు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు, మంత్రివర్గంలో చోటుతోపాటు నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్ట్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది.
– శంకరయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

న్యాయం జరుగుతుంది  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. పార్టీ తరపున 10 శాతం అదనంగా సీట్లు కేటాయించడం అభినందనీయం. రాజ్యాంగబద్ధంగా అదనపు రిజర్వేషన్లు పొందలేని బీసీలకు దీనివల్ల న్యాయం జరుగుతుంది.  
– అనుమోలు చుక్కయ్య, బీసీ సంఘం కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు 

బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు.. 
బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టులా బలహీన వర్గాలకు అదనంగా 10 శాతం సీట్లు వైఎస్సార్‌సీపీ తరపున ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించడం అభినందనీయం.  బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుంది.
– కోలా అశోక్, కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

మాట నిలబెట్టుకున్నారు 
బీసీలకు ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. బీసీలను ఎదగనివ్వకుండా  కుయుక్తులు పన్నుతున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. కోర్టు తీర్పుతో రిజర్వేషన్లు తగ్గినప్పటికీ వైఎస్సార్‌సీపీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు పది శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం.
– ప్రకాష్,  చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక

చరిత్రాత్మక నిర్ణయం 
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున బీసీలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. బీసీలు సీఎంకు రుణపడి ఉంటారు.  గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు.  
– లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం 

మహిళలకు అవకాశం 
బీసీలకు సీట్లు పెరగడం వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. 
– మానేపల్లి వీరేష్, స్వర్ణకారుడు, అమలాపురం 

బాబుది కాటు తంత్రం .. జగన్‌ది సామాజిక మంత్రం
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత  చంద్రబాబు పన్నిన కుట్రలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థంగా తిప్పికొట్టారని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంటని ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా బుద్ధి మారని టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని స్పష్టం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement