సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో ఎవరెవరికి ఎంత మొత్తం వారి చేతికే నేరుగా అందజేస్తారనే వివరాలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో వారికే నేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. ఎన్నికల నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందజేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఎన్నికలకు ముందే ఆయన స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర బ్యాంకర్ల సంఘం గణాంకాల ప్రకారం.. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల పేరిట రూ.27,147 కోట్ల అప్పులు ఉన్నట్టు తేల్చారు. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన మేరకు రెండో ఏడాది నుంచి ఈ పథకం అమలు చేసేలోగా.. వడ్డీ భారం మహిళలపై ఏమాత్రం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం రుణంపై పథకం అమలు చేసే నాటికి రూ.2,472 కోట్లు వడ్డీ అవుతుందని అంచనా వేసి, ఆ డబ్బులను ప్రభుత్వం మొదటి ఏడాదే బ్యాంకులకు చెల్లించాలని కూడా నిర్ణయించారు. రెండో ఏడాది నుంచి రూ.27,147 కోట్ల మొత్తాన్ని సంఘాల వారీగా అప్పును బట్టి నాలుగు విడతల్లో చెల్లిస్తారు.
అప్పుల వివరాలన్నీ పారదర్శకం
డ్వాక్రా పొదుపు సంఘాలకు జీరో వడ్డీ, వైఎస్సార్ ఆసరా పథకాల అమలు కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సెర్ప్, మెప్మా అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, సెర్ప్ సీఈవో రాజాబాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ పథకం అమలులో ఎవరికీ ఏ అనుమానాలు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా ఉండడానికి సంఘాల వారీగా అప్పుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి గ్రామ, వార్డు వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే.. వారి ద్వారా డ్వాక్రా సంఘాలకు సీఎం రాసిన లేఖతో పాటు ఆ సంఘం పేరిట ఉన్న అప్పు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. మొత్తం రుణంపై మొదటి ఏడాదికయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి, రశీదులను సైతం వలంటీర్ల ద్వారా అందజేయాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రస్తుతం సంఘాల వారీగా ఏ సంఘం పేరిట ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందన్న వివరాలను సెర్ప్, మెప్మా అధికారులు సేకరిస్తున్నారు. సంఘం పేరిట ఉండే అప్పు మొత్తాన్ని నిర్ధారిస్తూ మొదట సంబంధిత బ్యాంకు అధికారి నుంచి ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు. అప్పు మొత్తంలో ఎటువంటి తప్పు ఒప్పులకు తావు లేకుండా ఉండేందుకు సెర్ప్, మెప్మా అధికారులు సంబంధిత సంఘాన్ని సమావేశ పరిచి బ్యాంకు నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మొత్తాన్ని నిర్ధారించుకుని, ఆ సంఘం సభ్యుల నుంచి సంతకాలు కూడా తీసుకుంటున్నారు.
ఇక క్రమం తప్పకుండా జీరో వడ్డీ డబ్బులు
మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకునే రుణాలపై ఇక నుంచి అపరాధ వడ్డీ భారమన్న ప్రసక్తే లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా సీఎం సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకయ్యే వడ్డీ డబ్బులను జీరో వడ్డీ పథకం ద్వారా గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో బ్యాంకులకు చెల్లించని కారణంగానే మహిళలకు మోయలేనంత భారంగా మారాయని సమీక్షలో సీఎం వ్యాఖ్యానించారు. ఇక నుంచి జీరో వడ్డీ డబ్బులను క్రమం తప్పుకుండా బ్యాంకులకు చెల్లించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. జీరో వడ్డీ పథకంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం వడ్డీ డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తుందన్న వివరాలు సంబంధిత సంఘంలోని మహిళలకు తెలిసేలా బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అందజేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment