
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై ఏవిధంగా ముందుకు సాగాలనే అంశంపై వారితో చర్చించనున్నారు. సీఎం ఛాంబర్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు సహా ప్రసాద్ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
చదవండి: రూల్ ప్రకారం జరగలేదు... అయినా సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాం
కాగా ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించేలా టీడీపీ వ్యూహరచన చేసిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధం.. టీడీపీ ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదు..’ అని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా చెబుతూనే ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ రూలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాలపై ఈనాటి భేటీలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇక ఈ బిల్లులు శాసన సభలో ఆమోదం పొందిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment