సాక్షి , రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెలలో జిల్లాలో పర్యటించనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసి గాలికొదిలేసిన జీఎస్‌పీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్) పరిహారాన్ని బాధిత మత్స్యకారులకు అందజేసేందుకు ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో ఆమోదించిన సంగతి తెలిసిందే. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని సుమారు 17,550 మంది మత్స్యకారులకు ఏడు నెలల కాలానికి పరిహారం రూ.80 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ కృషి ఫలించడంతో ఆ పరిహారాన్ని ముమ్మిడివరంలోనే సీఎం చేతులు మీదుగా పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం ముమ్మిడివరం వచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదించిన క్రమంలో వచ్చే నెల 21న ముహూర్తంగా నిర్ణయించారు.
పశువుల్లంకలో వంతెనను పరిశీలిస్తున్న కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తదితరులు
పరిహారం పంపిణీతోపాటు అదే నియోజకవర్గం ఐ.పోలవరం మండలంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.35 కోట్లతో శంకుస్థాపన చేయగా పూర్తయిన పశువుల్లంక–సలాదివారిపాలెం వంతెనను కూడా సీఎంతో ప్రారంభింపజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ శుక్రవారం నిర్మాణం పూర్తయిన వంతెనను, పరిహారం పంపిణీ కోసం ఏర్పాటు చేసే సభకు అనువైన మురమళ్ల శరభయ్య చెరువు సమీపంలో ఉన్న ఖాళీ స్థలం, వారధికి సమీపంలో ఖాళీ స్థలాలు, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలు పరిశీలించారు. ముమ్మిడివరం మండలం కొమానపల్లి ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి 21న పర్యటన దాదాపు ఖాయమైందని కార్యక్రమం ఎలా నిర్వహించాలనేది మంత్రులు, ప్రజాప్రతినిధులు త్వరలో నిర్ణయిస్తారని కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment