కుటుంబ సర్వే సమగ్రంగా జరగాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Coronavirus Prevention | Sakshi
Sakshi News home page

వ్యవసాయంపై ‘కరోనా’ ప్రభావం పడకూడదు..

Published Thu, Apr 9 2020 5:00 PM | Last Updated on Thu, Apr 9 2020 7:13 PM

CM YS Jagan Review On Coronavirus Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరయ్యారు. సమీక్షా సమావేశానికి ముందు.. దేశంలో కరోనా విస్తరణ, నమోదవుతున్న కేసులు, అనుసరిస్తున్న వైద్య విధానాలు, వివిధ అధ్యయనాలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి అందించారు. అనంతరం రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యల వివరాలను సీఎం కు అధికారులు నివేదించారు. (ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు)

పోలీసు శాఖ పనితీరుపై ప్రశంసలు..
ఉదయం 9 గంటల వరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని.. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులు వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వీరి పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ... వాటి కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టు అయిన వారి వివరాల సేకరణలో రాష్ట్ర పోలీసు విభాగం పనితీరుపై అధికారులు ప్రశంసలు కురిపించారు. డీజీపీ నేతృత్వంలో సిబ్బంది అద్భుతంగా పనిచేసి ఢిల్లీ వెళ్లినవారివే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకున్నట్టయిందని అధికారులు తెలిపారు.
(కరోనా ఏ వస్తువుపై ఎన్ని రోజులు ఉంటుందంటే..) 

కుటుంబ సర్వేపై సీఎం ఆరా..
రాష్ట్రంలో ఇప్పటికే జరిగిన మొదటి, రెండు కుటుంబాల వారీ సర్వేపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. మూడోసారి జరుగుతున్న సర్వేపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందజేశారు. భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాల ప్రకారం మరో రెండు కేటగిరీలను చేర్చి, అదనపు ప్రశ్నలను సర్వేలో జోడించామని అధికారులు తెలిపారు. కుటుంబ సర్వే సమగ్రంగా జరగాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వే చేసి వివరాలు నమోదుచేయాలని సీఎం పేర్కొన్నారు. రియల్‌ టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదుచేస్తున్నామని సీఎం కు  అధికారులు వివరించారు.

తప్పులకు ఆస్కారం ఉండకూడదు..
మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మంది కూడా ఈ సర్వేలో భాగంగా ఉండాలని సీఎం  స్పష్టం చేశారు. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా... వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఎక్కడా కూడా తప్పులకు జరగడానికి అవకాశాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని సీఎం తెలిపారు. ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులపై సీఎం ఆరా తీశారు. ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని.. దీనిపై  నిశితంగా సమీక్ష చేయాలని.. ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్వారంటైన్లలో సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని, నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎంకు అధికారులు  వివరించారు.

వ్యవసాయం, పరిస్థితులపై సీఎం సమీక్ష:
వ్యవసాయంపై కోవిడ్‌ –19 ప్రభావం, రైతులకు అండగా తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై అధికారులు వివరాలు అందించారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు పంట రావడం పెరుగుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్‌–19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆ మేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రవాణాలో కూడా నిల్వ చేయలేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మిర్చి మార్కెట్‌ యార్డులను రెడ్‌జోన్, హాట్‌స్పాట్లకు దూరంగా వికేంద్రీకరణ చేస్తున్నామని..  ఉత్పత్తి ఉన్నచోటే మార్కెట్‌ యార్డులను పెట్టేదిశగా ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రైతులు బయట మార్కెట్లో తమ పంటలను అమ్ముకోవాలని అనుకుంటే వారికి పూర్తిగా సహకరించేలా రవాణా సౌకర్యాలు అందించాలని సీఎం సూచించారు. వీరికి మార్కెటింగ్‌ పరంగానూ అధికారులు సహాయ సహకారాలు అందించాలని సీఎం తెలిపారు. 

అధికారులు దూకుడుగా ఉండాలి..
‘‘రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ జరగాలన్న ఉద్దేశం నెరవేరాలి. రైతులను ఆదుకునే చర్యల విషయంలో అధికారులు దూకుడుగానే ఉండాలని’ సీఎం అన్నారు. రాష్ట్రంలో పండే పండ్లను స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని సీఎం కు అధికారులు వివరించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇప్పటికే అరటి పళ్ల విక్రయాన్ని ప్రారంభించామని, క్రమంగా చీనీ లాంటి పంటనూ స్థానికంగా గ్రామాల్లో అందుబాటులోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement