కేసులు తగ్గొచ్చని భావిస్తున్నాం: ఏపీ అధికారులు | CM YS Jagan Review Meeting On Coronavirus Preventive Measures | Sakshi
Sakshi News home page

కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Published Tue, Apr 7 2020 3:02 PM | Last Updated on Tue, Apr 7 2020 4:55 PM

CM YS Jagan Review Meeting On Coronavirus Preventive Measures - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకే పాజిటివ్‌ కేసు వచ్చిందని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గొచ్చని భావిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
(చదవండి: ఏపీలో మరో 51 పాజిటివ్‌)

అధికారుల వివరాలు
మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా.. 196 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3 నుంచి 4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి పరీక్షలు నిర్వహించగా.. 84 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 280 కేసులు ఢిల్లీ వెళ్లివచ్చినవారితో సంబంధాలున్నవే. విదేశాల నుంచి వచ్చిన వారికి 205 మందికి పరీక్షలు చేయగా..11 మందికి పాజిటివ్‌ అని తేలింది. వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు చేయగా.. 6 గురికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలుగా భావించిన వారిలో 134 మందికి పరీక్షలు చేస్తే 7గురికి పాజిటివ్‌ అని తేలింది.
(చదవండి: దేశ ప్రజలను మోదీ సంఘటితం చేశారు : అవంతి)

ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దానిపై సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‌ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన పద్ధతిలో ర్యాండర్‌ సర్వేలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

వసతులు, సదుపాయాలపై దృష్టి
క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలు, వసతులను పెంచడానికి ప్రధానంగా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ క్వారంటైన్లలో సుమారు 5300కు పైగా ప్రజలున్నారని అధికారులు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇంకా 19,247 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిని ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరి ఐసోలేషన్‌ పీరియడ్‌ ముగిసిందని, ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌ కొనసాగిస్తున్నామని అధికారులు చెప్పారు. వీరు కాక మరో లక్ష మంది హోం క్వారంటైన్‌లో.. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పర్యవేక్షణలో ఉన్నారు. 

కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపై దృష్టి
క్రిటికల్‌ కేర్‌ కోసం నిర్దేశించిన కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే జిల్లాల వారీగా నిర్దేశించుకున్న ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. వాటిల్లో మెరుగైన సదుపాయాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం  ప్రమాణాలు పాటించాలని సీఎం చెప్పారు. వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. అలాగే క్వారంటైన్లు, క్యాంపుల్లో కూడా మరోసారి వసతులపై పరిశీలన చేసి, ఎక్కడైనా మెరుగుపరచాల్సిన అంశాలు ఉంటే వెంటనే దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. 

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సమీక్ష
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతిరోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటిని ఎగుమతి చేస్తున్నామని, మరోవైపు మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

టమోటా దిగుమతులు క్రమంగా తగ్గుతున్నుందున మార్కెట్లోనే అమ్ముడు పోతోందని... ఈ పంట విక్రయం విషయంలో సమస్యలు తొలగిపోయాయని అధికారులు చెప్పారు. బొప్పాయి, మామిడి పంట కొనుగోలుపైనా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. కర్నూలు వెలుపల ఉల్లి మార్కెట్‌ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో కూడా క్రమంగా ఎగుమతులు పెరిగాయని, కనీసం రోజూ 40 కంటైనర్ల వరకూ ఎగుమతి అవుతోందని అధికారులు చెప్పారు. అలాగే ప్రాసెసింగ్, కోల్డు స్టోరీజీ ప్లాంట్లు కూడా దాదాపుగా తెరుచుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలపై సీఎం ఆరా తీశారు. సంబంధిత రైతులను గుర్తించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
(చదవండి: యూట్యూబ్‌లో చూసి ప్రాణాల మీదకు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement