టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ | CM YS Jagan Review Meeting On Nadu-Nedu In Govt Schools | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Published Thu, Jun 4 2020 3:35 AM | Last Updated on Thu, Jun 4 2020 8:33 AM

CM YS Jagan Review Meeting On Nadu-Nedu In Govt Schools - Sakshi

‘నాడు–నేడు’లో ఏర్పాటు చేసే గ్రీన్‌ బోర్డ్‌పై రాస్తున్న సీఎం జగన్‌

‘నాడు – నేడు’ నా మనసుకు చాలా నచ్చిన కార్యక్రమం. దీని కింద పాఠశాలల నిర్మాణాల్లో, పనుల్లో నాణ్యత కోసం పాటించాల్సిన పద్ధతులకు స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందించాలి. దీనిని సంబంధిత విభాగాలకు పంపించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలి. గవర్నమెంట్‌ అంటే నాసిరకం కాదు.. క్వాలిటీ అన్న పేరు రావాలి.

6 నుంచి 10 తరగతుల పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలి. విద్యార్థులకు వస్తున్న మార్కులు, వారు చూపిస్తున్న ప్రతిభపై సమాచారాన్ని సేకరించి అనలైజ్‌ చేయాలి. ఏయే సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో గుర్తించి.. నేర్చుకోవడంలో వారికున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక పద్ధతులు, విధానాలను రూపొందించాలి. 

డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలి. సెంట్రలైజ్డ్‌ వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా టీచర్లు, విద్యార్థులు ఇంటరాక్ట్‌ అవడానికి వీలుంటుంది. ఈ అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయి. 
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: విద్యార్థుల సంఖ్య ఆధారంగా, వారి అవసరాల మేరకే టీచర్లను నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని కచ్చితంగా పాటిస్తూ బదిలీలు ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మంచి చేయడానికి టీచర్ల బదిలీలు దోహదం చేసేలా విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. జూలై 15 తర్వాత ఆన్‌లైన్‌ విధానంలో టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే దానిపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం సూచించారు. 2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతబడ్డాయని సమావేశంలో చర్చకు వచ్చింది. సమీక్షలో సీఎం ఆదేశాలు, అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.
నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయబోయే నూతన కుర్చీలు, బెంచీలు, సీలింగ్‌ ఫ్యాన్‌లు, తాగునీటి వాటర్‌ప్లాంట్‌లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

పిల్లలకు మంచి జరగాలి
► ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి.. విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలలకు ఎలా పంపాలి.. అనే కోణంలో అప్పుడు నిర్ణయాలు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగింది.
► అక్టోబర్, నవంబర్‌ నెలలు వచ్చినా యూని ఫామ్స్, పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు పిల్లల కు మంచి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాం.
► పిల్లలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరినీ ఇబ్బందులకు గురి చేయొద్దు. అధికారులు అందరూ కూర్చొని టీచర్ల రీ పొజిషన్‌కు సంబంధించి విధి విధా నాలు రూపొందించాలి.
► ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందించడానికి విప్లవాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 

చురుగ్గా పనులు
► నాడు –నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలి. దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలి. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలి.
► నాడు – నేడు పనులకు సంబంధించి రూ.533 కోట్లు పేరెంట్స్‌ కమిటీల ఖాతాల్లో ఉన్నాయని అ«ధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధిక నిధులు ఖర్చయ్యాయని, లాక్‌డౌన్‌ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని చెప్పారు.
► ప్రత్యేకంగా జేసీలను నియమించడం వల్ల పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వివరించారు.  
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొమ్మినేనివారిపాలెం (యెండ్లూరు) గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతి గదులకు కరెంటు వైరింగ్, ఫ్లోరింగ్‌ పనులు చేస్తున్న దృశ్యం 

మధ్యాహ్న భోజనం నాణ్యత బావుండాలి
► గోరుముద్ద కింద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతో ఉండాలి. పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడడు. 
► కలెక్టర్లు, జేసీలు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి. దీన్ని విధిగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలి. స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలి. ఏ సమస్య ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫోన్‌ చేసేలా ఆ నంబర్‌ను ప్రదర్శించాలి. సమస్యలు ఉంటే తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
► పాఠశాలలు, అందులోని బాత్‌రూమ్స్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
► జగనన్న విద్యా కానుక కోసం ఈ నెల 8, 9 తేదీలలో షూస్‌ కోసం విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. 
► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి రాజ శేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం సూచనల మేరకే టీచర్ల బదిలీలు 
టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే బదిలీలు చేప డతాం. వెబ్‌ బేస్‌ కౌన్సిల్‌ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయి. టీచర్లు బదిలీల కోసం ఎవరి చుట్టూ తిరగా ల్సిన అవసరం లేదు. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్‌ ప్రారంభం అయ్యేలోపు బదిలీలు ఉంటాయి. ఒక్క స్కూల్‌ కూడా మూయడానికి వీల్లేదని సీఎం ఆదేశించారు.
– ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి 

రివర్స్‌ టెండరింగ్‌లో రూ.144.80 కోట్లు ఆదా
నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు, పరికరాల కొనుగోళ్లలో ఇప్పటి వరకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.144.80 కోట్లను ఆదా చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు. వస్తువులు, పరికరాల కోసం దాదాపు రూ.890 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని, శానిటరీ ఐటమ్స్‌ కాకుండా మిగతా వాటికి టెండర్లు కూడా ఖరారు చేశామని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తొలి దశలో చేపడుతున్న పనుల పురోగతిని సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న పిల్లలు కూర్చునే బల్లల నమూనాలతో పాటు వాటర్‌ ప్యూరిఫైర్, ఫిల్టర్, అల్మరాలు, సీలింగ్‌ ఫ్యాన్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..

సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి
► పాఠశాలలకు అవసరమైన వస్తువులు, ఫర్నిచర్‌.. తదితర వాటి కొనుగోలు కోసం సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లడం ద్వారా సమయానికి వాటిని పొందడమే కాకుండా, నాణ్యత ఉంటుంది. బిడ్డింగ్‌లో పోటీ కారణంగా తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. 
► గవర్నమెంట్‌ స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఫర్నిచర్‌ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యం అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చే నెల చివరి నాటికి అన్ని స్కూళ్లలో ఏర్పాట్లు పూర్తి కావాలి.

ఏవేవి ఎన్నెన్నంటే..
► తొలి దశలో 15,715 స్కూళ్ల మార్పులో భాగంగా 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 నుంచి 3వ తరగతి వరకు 1.50 లక్షల బల్లలు,  4 నుంచి 6వ తరగతి వరకు మరో 1.50 లక్షల బల్లలు, 7 నుంచి 10వ తరగతి వరకు డ్యుయల్‌ డ్రాలతో కూడిన 2.10 లక్షల బల్లలు కొనుగోలు చేస్తోంది. టీచర్ల కోసం 89,340 కుర్చీలు, టేబుళ్లు, 72,596 గ్రీన్‌ చాక్‌ బోర్డులు, 16,334 అల్మారాలు, 1,57,150 ఫ్యాన్ల కొను గోలుకు టెండర్లు ఖరారు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement