క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
క్రిటికల్ కేర్ కోసం నాలుగు ప్రత్యేక ఆసుపత్రులు, ప్రతి జిల్లాకూ ఒక ఆసుపత్రి అన్ని విధాలా సన్నద్ధం అయ్యాయి. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం. క్వారంటైన్, ఐసోలేషన్ గదుల్లో సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. సౌకర్యాలు, సదుపాయాలు బాగుండేలా శ్రద్ధ పెట్టాం.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలి. రవాణా సౌకర్యం పెంచడానికి సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడాలి. మొక్కజొన్న, శనగ, కందులు, జొన్నలు, పసుపు లాంటి పంటలకు మార్కెటింగ్, ధరల పరంగా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఇంటింటి సర్వేల ద్వారా గుర్తించిన జలుబు, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు, ఆస్తమా, బీపీ, షుగర్ వ్యాధులతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధికారులను ఆదేశించారు. కార్వంటైన్, ఐసోలేషన్ గదుల్లో మంచి సదుపాయాలు కల్పించాలని సూచించారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, కొనుగోలు అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కేసుల పరిస్థితి, వ్యాధి నివారణ చర్యల గురించి ఆరా తీశారు. కోవిడ్–19 నివారణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాలో అదనంగా ఐదేసి ఆస్పత్రుల చొప్పున వెంటనే గుర్తించాలని సూచించారు. ఈ సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు, సీఎం సలహాలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
మొక్కజొన్నపై దృష్టి
► పౌల్ట్రీ సెక్టార్‌తో మాట్లాడి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేలా చూడాలి. రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.
► అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ యాప్‌ను గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు తప్పనిసరిగా ఉపయోగించేలా చూడాలి. ఆయా గ్రామాల్లోని పంటలు, వాటి ధరలపై ఎప్పటికప్పుడు ఆ యాప్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.
► యాప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా వెనువెంటనే చర్యలు తీసుకునేలా వ్యవస్థ సన్నద్ధతతో ఉండాలి.
► రొయ్యలు, చేపల ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలి. దీనిపై కార్యాచరణ రూపొందించాలి.
► సమీక్షా సమావేశంలో మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజారోగ్య వ్యవస్థలు బలోపేతం
ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారానే కరోనా వైరస్‌తో పాటు ఇతర వైరస్‌లు, వ్యాధులను సమర్థవంతంగా అడ్డుకోగలమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ఆలోచనలు, సమగ్ర కార్యాచరణ ప్రణాళికలతో ఇలాంటి వైరస్‌లు, వ్యాధులను నిరోధించవచ్చన్నారు. లాక్‌డౌన్, కరోనా వైరస్ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇలాంటి వైరస్‌లు, వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వ పరంగా సిద్ధం కావాల్సిన అంశాలపైనా చర్చించారు. రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితి, వైరస్ నివారణ చర్యలపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బందికి క్రిటికల్ కేర్‌లో భాగంగా వెంటిలేటర్ల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
► ఆరోగ్య రంగంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిన ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి.
► రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులున్న ప్రాంతాలు, అక్కడ అనుసరిస్తున్న విధానాలపై సీఎం ఆరా తీశారు. లాక్‌డౌన్‌ను ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై చర్చించారు.
► వీలైనన్ని పరీక్షలు చేయడం ద్వారా కరోనా సోకిన వారిని, వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే కార్యక్రమం ముమ్మరంగా సాగాలి.
► సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment