సమర్థవంతంగా టెలి మెడిసిన్ | CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా టెలి మెడిసిన్

Published Thu, Apr 30 2020 3:23 AM | Last Updated on Thu, Apr 30 2020 10:25 AM

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ముగ్గురు జేసీల్లో ఒకరికి టెలి మెడిసిన్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. ఇందుకు సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపొందించుకోవాలి. కుటుంబ సర్వేలో గుర్తించిన వారందరికీ త్వరితగతిన పరీక్షలు పూర్తి చేయాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

గత 5 రోజుల్లో కేసులు నమోదైన ప్రాంతాలు వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు. ఇవి 76 ఉన్నాయి. 5 నుంచి 14 రోజులుగా కేసులు లేనివి యాక్టివ్‌ క్లస్టర్లు. ఇవి 55 ఉన్నాయి. 14 నుంచి 28 రోజులుగా కేసులు లేనివి డార్మంట్‌ క్లస్టర్లు. ఇవి 73 ఉన్నాయి. 28 రోజుల నుంచి కేసులు లేనివి క్లస్టర్లు. 
– సీఎంతో అధికారులు

సాక్షి, అమరావతి: టెలి మెడిసిన్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లలో ఒకరికి ఈ విధానాన్ని పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలని సూచించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

ఫోన్‌ చేసిన వారికి అదే రోజు మందులు
► టెలిమెడిసిన్‌ విధానంలో అందిస్తున్న వైద్య చికిత్సలపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు టెలి మెడిసిన్‌కు కాల్‌ చేసిన వారికి అదే రోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 
► టెలి మెడిసిన్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని, మందులు వెళ్లాయా? లేదా? అనే విషయాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
► కుటుంబ సర్వేలో గుర్తించిన వారిలో ఇప్పటి వరకు 12,247 మందికి పరీక్షలు చేశామని, మూడు రోజుల్లో మిగతా వారికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. 
ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పాజిటివిటీ కేసులు 1.51 శాతమే
► గత 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నర్సరావుపేట నుంచే వచ్చాయని తెలిపారు. అక్కడ పెద్ద ఎత్తున కంటైన్‌మెంట్‌ చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ కేసులు 3.84 శాతం ఉంటే, రాష్ట్రంలో అది 1.51 శాతం ఉందన్నారు. 
► గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 88,061 పరీక్షలు చేశామని, ప్రతి మిలియన్‌కు 1,649 పరీక్షలతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించారు.  
► మరింత ఫోకస్‌గా, సూక్ష్మ స్థాయిలో కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా క్లస్టర్ల వారీ విశ్లేషణను జిల్లా కలెక్టర్లకు అందిస్తామని అధికారులు తెలిపారు.

కొత్త ల్యాబ్‌ల ఏర్పాటు పనులు ముమ్మరం
► శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్ట్‌లు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఒంగోలు, నెల్లూరులో ల్యాబ్‌ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. శనివారం నాటికి ఈ మూడు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం 9 ల్యాబ్‌లు పని చేస్తున్నాయన్నారు. 
► ఇవికాక ప్రతి ఏరియా, టీచింగ్‌ ఆసుపత్రుల్లో సుమారు 50 చోట్ల ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయని, డీఆర్డీఓతో మాట్లాడి మొబైల్‌ ల్యాబ్‌ను కూడా తయారు చేయిస్తున్నామని సీఎంకు వివరించారు. 
► ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి కోవిడ్‌–19 వివరాలు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement