ఇళ్ల స్థలాల పట్టాలు 8న ఇవ్వాల్సిందే | CM YS Jagan Says Distribution Of Houses To The Poor Will Be On July 8 | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల పట్టాలు 8న ఇవ్వాల్సిందే

Published Wed, Jun 24 2020 3:01 AM | Last Updated on Wed, Jun 24 2020 10:30 AM

CM YS Jagan Says Distribution Of Houses To The Poor Will Be On July 8 - Sakshi

నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలి. 80 శాతం.. 85 శాతం.. 90 శాతం అయ్యిందని చెబితే అంగీకరించేది లేదు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులదే బాధ్యత. ఎక్కడా వివక్ష ఉండకూడదు. సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పట్టా అందాలి. 

ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో కోవిడ్‌పై పూర్తి సమాచారంతో ఒక హోర్డింగ్‌ పెట్టాలి. కోవిడ్‌ అనుమానం ఉంటే ఎవరెవర్ని సంప్రదించాలనే వివరాలు ఇవ్వాలి. ప్రతి గడప వద్దకూ వెళ్లి.. అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక్కటే మార్గమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వచ్చే నెల 8వ తేదీన నూటికి నూరు శాతం జరగాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. తనకు ఓటు వేయని వారైనా సరే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా ఇవ్వాల్సిందేనని చెప్పారు. కోవిడ్‌ పరిస్థితులు తగ్గు ముఖం పట్టాక గ్రామాల్లో పర్యటిస్తాని, అప్పుడు ఇంటి పట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తని విధంగా పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన సచివాలయం నుంచి పలు కార్యక్రమాలు, పథకాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులు 

ఇళ్ల పట్టాల పంపిణీ అతి ముఖ్యం

  • జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 30 లక్షల దాకా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం ఇది. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. 
  • పెన్షన్‌ కార్డు 10 రోజులు, రేషన్‌ కార్డు 10 రోజులు, ఆరోగ్య శ్రీ కార్డు 20 రోజులు, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలి. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. 

 వర్షాకాలంలోగా పుష్కలంగా ఇసుక నిల్వలు

  • నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వ చేయాలి. వచ్చే రెండు వారాలు మాత్రమే మనకు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. రీచ్‌లు మునిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరితగతిన ఇసుకను నిల్వ చేయాలి. (ఇప్పటికే 46.30 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వ చేశామని అధికారులు వివరించారు)
  • శ్రీకాకుళం జిల్లాలో 20 వేల టన్నులు, తూర్పు గోదావరిలో 60 వేల టన్నులు, పశ్చిమ గోదావరిలో 35 వేల టన్నులు, కృష్ణా జిల్లాలో 50 వేల టన్నులు, గుంటూరులో 40 వేల టన్నుల ఇసుక ప్రతి రోజూ ఉత్పత్తి చేయాలి.

  భారీగా ఉపాధి హామీ పనులు

  • ఉపాధి హామీ కింద భారీగా పనులు కల్పించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 
  • గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, అంగన్‌వాడీ కేంద్రాల మీద కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగిస్తే వెంటనే పనులు మొదలు పెడతారు. 
  • నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదు. ఇవన్నీ వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.


వార్డు హెల్త్‌ క్లినిక్స్‌

  • పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్‌ అర్బన్‌ (వార్డు) హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి. 2 కి.మీ పరిధిలో కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లే దూరంలో వీటి నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకు వెంటనే స్థలాలను గుర్తించాలి

నాడు–నేడు పనులు త్వరగా పూర్తవ్వాలి

  • ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి వస్తుంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి.
  • ఫర్నిచర్, ఫ్యాన్లు.. అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తి కాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూళ్లు తెరిచేలోగా నాడు –నేడు కింద పనులు పూర్తి కావాలి. కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి.
  • అర్బన్‌ ప్రాంతాల్లో కాంపౌండ్‌ వాల్‌ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు – నేడుకు నిధుల కొరత లేదు. వెంటనే మున్సిపల్‌ కమిషనర్లతో సమన్వయం చేసుకుని స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలి. 


ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు 

  • ఆగస్టు 9న ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ చేసి, తద్వారా గిరిజనులకు జీవనాధారం చూపించాలి. అప్పుడే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందే అవకాశాలు ఉంటాయి.

ఇ–క్రాపింగ్‌పై దృష్టి పెట్టాలి

  •  ఆర్బీకేల కోసమే ఒక జాయింట్‌ కలెక్టర్‌ను పెట్టాం. 10,641 ఆర్బీకేలు, 65 ఆర్బీకే హబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్‌ ఇవ్వగానే 48 గంటల్లోగా అవి డెలివరీ కావాలి.
  • ఇ–క్రాపింగ్‌ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. 
  • పంటలు కొనుగోలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, పంట రుణాలు ఇవ్వాలంటే ఇ–క్రాపింగ్‌  ముఖ్యం. హార్టికల్చర్, ఫిషరీస్‌ కూడా ఇ– క్రాపింగ్‌లో నమోదు కావాలి.

 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం

  • నాడు– నేడు కింద 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ఢి చేస్తున్నాం. భవనాలు ఉన్న చోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం. 
  • సొంతంగా భవనాలు లేని చోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటి కోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్‌కు బదిలీ చేయాలి. 

ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి

  • పచ్చదనం పెంపునకు జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాడు –నేడులో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తున్నందు వల్ల అక్కడ.. ఇంకా ఖాళీ స్థలాలు, ఇంటర్నల్‌ రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి.
  • ఇళ్ల స్థలాల లే అవుట్‌లలో కూడా బాగా మొక్కలు నాటాలి. ప్రతి ఇంటి స్థలం పట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కలు ఇవ్వాలి. 


ఆదోని ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ

  • క్యూ ఆర్‌ కోడ్‌తో ఉన్న ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తున్నాం. దాదాపు 22 లక్షల కార్డులు ఇంకా పంపిణీ కాలేదు. ఇవి పూర్తిగా పంపిణీ చేయాలి. 
  • 16 మెడికల్‌ కాలేజీలను కొత్తగా కట్టబోతున్నాం. ఇందుకోసం ప్రతి చోటా 50 ఎకరాలు పొజిషన్‌లోకి తీసుకునే కార్యక్రమాన్ని వెంటనే సంబంధిత శాఖకు అప్పగించాలి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఉన్న మెడికల్‌ కాలేజీలు కేవలం 11 మాత్రమే. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో కొత్తగా మరో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం.  

సాగునీటి ప్రాజెక్టులు

  • వంశధార, తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.  ఈ సీజన్‌లో వెలిగొండ అందుబాటులోకి వస్తుంది. ఇందు కోసం అన్ని చర్యలూ తీసుకోవాలి.
  • పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పునరావాస పనులు చేపట్టాలి. 41.5 మీటర్ల ఎత్తు వరకు ఎక్కడా ముంపునకు గురి కాకుండా.. ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చురుగ్గా తీసుకోవాలి. 

 సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితం

  • సొంత అవసరాల కోసం నదుల నుంచి, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో పాటు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 

కోవిడ్‌–19 వ్యాప్తి నివారణపై ఫోకస్‌

  • వ్యాక్సిన్‌ కనుక్కునేంత వరకూ కోవిడ్‌తో కలిసి బతకాల్సిన పరిస్థితి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మనం ఫోకస్‌ పెట్టాలి. దాని పట్ల ఉన్న భయం (స్టిగ్మా తొలగించాలి) పోవాలి. ఆ మేరకు చైతన్యం, అవగాహన కలిగించాలి. అప్పుడే మరణాలు తగ్గుతాయి. 
  • కోవిడ్‌ సోకిందనే అనుమానం రాగానే వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. భయం, ఆందోళనతో చివరి వరకూ చెప్పకపోతే అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఆ పరిస్థితి రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
  • కోవిడ్‌ సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఓపీపై అవగాహన కల్పించాలి.
  • జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సదుపాయాలపై దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. 85 శాతం కేసులు ఇంట్లోనే ఉన్నా నయం అయిపోతాయి. వారికి మందులు ఇవ్వాలి. ఆ యంత్రాంగం కరెక్టుగా ఉందా లేదో పరిశీలించాలి.
  • ఆస్పత్రులకు వచ్చే 15 శాతం మందికి సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా చూడండి. ప్రతి జిల్లాకు కనీసం 1500 బెడ్లు ఉండేలా చూసుకోవాలి. అక్కడ సదుపాయాలు బాగా ఉండేలా చూసుకోండి. 
  • 108, 104 వాహనాలు ఒకేసారి 1060 ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ కూడా కొత్త వాహనాలే. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది. ఈ వెహికల్‌ ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న వారికి స్క్రీనింగ్‌ చేయాలి. 
  • ఇంటింటికీ సర్వే చేసి, ప్రతి ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్య వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు చేయాలి. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యా«ధులున్న 40 ఏళ్లకు పైబడ్డ వారికి పరీక్షలు చేయాలి. డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉంటాయి. ఈ మందులను వారికి అందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement