July 8th
-
కీలక ప్రకటన చేయనున్న సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తన 51వ జన్మదినమైన జులై 8న ఓ ప్రత్యేకమైన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని దాదా తన ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో లీడింగ్ విత్ అంటూ డైరీలో రాస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ.. జూలై 8న నా పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక ప్రకటన చేస్తున్నాను, వేచి ఉండండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. పుట్టిన రోజు గంగూలీ ఏం ప్రకటించబోతున్నాడో అని క్రికెట్ ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదా.. శుభవార్త చెబుతాడా లేక ఏదైనా బాంబు పేలుస్తాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గంగూలీ గురించి తెలిసినవారైతే.. దాదా తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయబోతున్నాడని అంటున్నారు. మరి గంగూలీ రేపు ఏ ప్రత్యేకమై ప్రకటన చేస్తాడో వేచి చూడాలి. కాగా, ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌గా విధుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదా ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐపీఎల్లో డీసీ చివరి స్థానంలో నిలిచింది. తన జమనాలో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపించిన దాదా.. ఐపీఎల్లో తన జట్టుకు న్యాయం చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కాస్త విరామం తీసుకున్న టీమిండియా.. జులై 12 నుంచి విండీస్‌తో వరస సిరీస్‌లతో బిజీ కానుంది. విండీస్ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్ సిరీస్ (2 టెస్ట్‌లు), ఆతర్వాత వన్డే (3 వన్డేలు), టీ20 సిరీస్ (5 టీ20లు)లు ఆడుతుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
8న ఘనంగా రైతు దినోత్సవం
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర స్థాయిలో మొదలు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయి వరకు ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆదాయం పెంచడమే లక్ష్యంగా, రైతులకు సకల సౌకర్యాలు ఉన్న ఊరిలోనే కల్పించడమే ధ్యేయంగా రెండేళ్లుగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రైతు దినోత్సవం సందర్భంగా రూ.1,506.95 కోట్ల విలువగల పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన విత్తనం నుంచి పంట విక్రయం వరకు చేదోడు వాదోడుగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,300 కోట్లతో 10,408 రైతు భరోసా కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే రూ.413.76 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తయిన 1986 డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను సీఎం అనంతపురం జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రారంభిస్తారు. వీటితో పాటు 100 ఇంటిగ్రేటెడ్ ఆక్వా, వ్యవసాయ, పశుసంవర్థక ల్యాబ్‌లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఇతరత్రా ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. కాగా, 8వ తేదీ నాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెండడుగులు ముందుకే.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల కోసం ఉన్న ఊరిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల వసతులు, సదుపాయాలను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుల గురించి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆలోచించారని, ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్ ఇంకా సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి రైతుల కోసం గ్రామాల్లోనే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెబుతున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనం మొదలు.. ఎరువులు, పురుగు మందులు నాణ్యమైనవి రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేస్తున్నారని, దీంతో రైతులు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే పని తప్పిందని వివరిస్తున్నాయి. రైతులు పండించిన పంటలను కూడా కనీస మద్దతు ధరకే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయిస్తున్నారని, రెండేళ్ల పాలనలోనే రైతులకు రైతు భరోసాతో పాటు వివిధ రంగాల ద్వారా 68 వేల కోట్ల రూపాయలకు పైగా సాయం అందించారని గుర్తు చేస్తున్నాయి. ప్రారంభోత్సవాలు వీటికే.. ►రూ.413.76 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన 1986 వైస్సార్ రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవనాలు. ►రూ.79.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 100 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్ ల్యాబ్‌లు. ►రూ.96.64 కోట్లతో తొలి విడత నిర్మించిన 645 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు. ►రూ.31.74 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 53 కొత్త వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు. ►పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రూ.7.53 కోట్ల వ్యయంతో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్. రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు సంవర్థక, ఆక్వా రంగాలకు ఇన్పుట్స్. ►రూ.మూడు కోట్ల వ్యయంతో ఆరు కొత్త రైతు బజార్లు. పశు–మత్స్య దర్శిని మ్యాగ్జైన్ ఆవిష్కరణ. వీటికి శంకుస్థాపనలు.. ►రూ.400.30 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణం. ►రూ.200.17 కోట్ల వ్యయంతో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం. ►అనకాపల్లిలో బెల్లం, రాజమండ్రిలో అరటి, శ్రీకాకుళంలో జీడిపప్పు, చిత్తూరులో మామిడి, బాపట్లలో చిరుధాన్యాలు, వైఎస్సార్ కడపలో అరటి, హిందూపురంలో వేరుశనగ, కర్నూలులో టమాట ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం. ►రూ.212.31 కోట్ల వ్యయంతో మార్కెట్ యార్డుల్లో నాడు– నేడు కింద అభివృద్ధి పనులు. ►రూ.45 కోట్ల వ్యయంతో కొత్తగా 45 రైతు బజార్ల ఏర్పాటు. ►వైఎస్సార్ జిల్లా ఊటుకూరులో రూ.2 కోట్లతో కడక్ నాథ్ పౌల్ట్రి ఏర్పాటు. ►రూ.15 కోట్లతో నాబార్డు ప్రాజెక్టు. -
జూలై 8న షర్మిల పార్టీ ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను, కార్యక్రమాలను తాము ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. షర్మిల తన కొత్త పార్టీని ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’(వైఎస్సార్టీపీ)గా రిజిస్ట్రేషన్ చేయించగా పార్టీ పేరుపై తనకు అభ్యంతరం లేదని వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి రాసిన లేఖను వైఎస్సార్ టీపీ ఈసీకి సమర్పించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30నే కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో కోరిందని, ఇప్పటివరకూ ఎటువంటి అభ్యంతరాలు రాలేదంటే అనుమతుల ప్రక్రియ పూర్తయిందని అనుకుంటున్నామని పేర్కొన్నారు. -
ఇళ్ల స్థలాల పట్టాలు 8న ఇవ్వాల్సిందే
నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలి. 80 శాతం.. 85 శాతం.. 90 శాతం అయ్యిందని చెబితే అంగీకరించేది లేదు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులదే బాధ్యత. ఎక్కడా వివక్ష ఉండకూడదు. సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పట్టా అందాలి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో కోవిడ్‌పై పూర్తి సమాచారంతో ఒక హోర్డింగ్ పెట్టాలి. కోవిడ్ అనుమానం ఉంటే ఎవరెవర్ని సంప్రదించాలనే వివరాలు ఇవ్వాలి. ప్రతి గడప వద్దకూ వెళ్లి.. అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక్కటే మార్గమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వచ్చే నెల 8వ తేదీన నూటికి నూరు శాతం జరగాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. తనకు ఓటు వేయని వారైనా సరే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా ఇవ్వాల్సిందేనని చెప్పారు. కోవిడ్ పరిస్థితులు తగ్గు ముఖం పట్టాక గ్రామాల్లో పర్యటిస్తాని, అప్పుడు ఇంటి పట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తని విధంగా పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన సచివాలయం నుంచి పలు కార్యక్రమాలు, పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తదితరులు ఇళ్ల పట్టాల పంపిణీ అతి ముఖ్యం జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 30 లక్షల దాకా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం ఇది. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. పెన్షన్ కార్డు 10 రోజులు, రేషన్ కార్డు 10 రోజులు, ఆరోగ్య శ్రీ కార్డు 20 రోజులు, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలి. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. వర్షాకాలంలోగా పుష్కలంగా ఇసుక నిల్వలు నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వ చేయాలి. వచ్చే రెండు వారాలు మాత్రమే మనకు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. రీచ్‌లు మునిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరితగతిన ఇసుకను నిల్వ చేయాలి. (ఇప్పటికే 46.30 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేశామని అధికారులు వివరించారు) శ్రీకాకుళం జిల్లాలో 20 వేల టన్నులు, తూర్పు గోదావరిలో 60 వేల టన్నులు, పశ్చిమ గోదావరిలో 35 వేల టన్నులు, కృష్ణా జిల్లాలో 50 వేల టన్నులు, గుంటూరులో 40 వేల టన్నుల ఇసుక ప్రతి రోజూ ఉత్పత్తి చేయాలి. భారీగా ఉపాధి హామీ పనులు ఉపాధి హామీ కింద భారీగా పనులు కల్పించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాల మీద కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగిస్తే వెంటనే పనులు మొదలు పెడతారు. నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదు. ఇవన్నీ వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వార్డు హెల్త్ క్లినిక్స్ పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ అర్బన్ (వార్డు) హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. 2 కి.మీ పరిధిలో కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లే దూరంలో వీటి నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకు వెంటనే స్థలాలను గుర్తించాలి నాడు–నేడు పనులు త్వరగా పూర్తవ్వాలి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి వస్తుంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. ఫర్నిచర్, ఫ్యాన్లు.. అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తి కాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూళ్లు తెరిచేలోగా నాడు –నేడు కింద పనులు పూర్తి కావాలి. కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. అర్బన్ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు – నేడుకు నిధుల కొరత లేదు. వెంటనే మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఆగస్టు 9న ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసి, తద్వారా గిరిజనులకు జీవనాధారం చూపించాలి. అప్పుడే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందే అవకాశాలు ఉంటాయి. ఇ–క్రాపింగ్‌పై దృష్టి పెట్టాలి ఆర్బీకేల కోసమే ఒక జాయింట్ కలెక్టర్‌ను పెట్టాం. 10,641 ఆర్బీకేలు, 65 ఆర్బీకే హబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్ ఇవ్వగానే 48 గంటల్లోగా అవి డెలివరీ కావాలి. ఇ–క్రాపింగ్ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. పంటలు కొనుగోలు, ఇన్పుట్ సబ్సిడీ, బీమా, పంట రుణాలు ఇవ్వాలంటే ఇ–క్రాపింగ్ ముఖ్యం. హార్టికల్చర్, ఫిషరీస్ కూడా ఇ– క్రాపింగ్‌లో నమోదు కావాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం నాడు– నేడు కింద 55 వేల అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ఢి చేస్తున్నాం. భవనాలు ఉన్న చోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం. సొంతంగా భవనాలు లేని చోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటి కోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్‌కు బదిలీ చేయాలి. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి పచ్చదనం పెంపునకు జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాడు –నేడులో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తున్నందు వల్ల అక్కడ.. ఇంకా ఖాళీ స్థలాలు, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఇళ్ల స్థలాల లే అవుట్లలో కూడా బాగా మొక్కలు నాటాలి. ప్రతి ఇంటి స్థలం పట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కలు ఇవ్వాలి. ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీ క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తున్నాం. దాదాపు 22 లక్షల కార్డులు ఇంకా పంపిణీ కాలేదు. ఇవి పూర్తిగా పంపిణీ చేయాలి. 16 మెడికల్ కాలేజీలను కొత్తగా కట్టబోతున్నాం. ఇందుకోసం ప్రతి చోటా 50 ఎకరాలు పొజిషన్లోకి తీసుకునే కార్యక్రమాన్ని వెంటనే సంబంధిత శాఖకు అప్పగించాలి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో కొత్తగా మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులు వంశధార, తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ సీజన్లో వెలిగొండ అందుబాటులోకి వస్తుంది. ఇందు కోసం అన్ని చర్యలూ తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పునరావాస పనులు చేపట్టాలి. 41.5 మీటర్ల ఎత్తు వరకు ఎక్కడా ముంపునకు గురి కాకుండా.. ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చురుగ్గా తీసుకోవాలి. సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితం సొంత అవసరాల కోసం నదుల నుంచి, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో పాటు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణపై ఫోకస్ వ్యాక్సిన్ కనుక్కునేంత వరకూ కోవిడ్‌తో కలిసి బతకాల్సిన పరిస్థితి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మనం ఫోకస్ పెట్టాలి. దాని పట్ల ఉన్న భయం (స్టిగ్మా తొలగించాలి) పోవాలి. ఆ మేరకు చైతన్యం, అవగాహన కలిగించాలి. అప్పుడే మరణాలు తగ్గుతాయి. కోవిడ్ సోకిందనే అనుమానం రాగానే వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. భయం, ఆందోళనతో చివరి వరకూ చెప్పకపోతే అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఆ పరిస్థితి రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఎస్ఓపీపై అవగాహన కల్పించాలి. జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సదుపాయాలపై దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. 85 శాతం కేసులు ఇంట్లోనే ఉన్నా నయం అయిపోతాయి. వారికి మందులు ఇవ్వాలి. ఆ యంత్రాంగం కరెక్టుగా ఉందా లేదో పరిశీలించాలి. ఆస్పత్రులకు వచ్చే 15 శాతం మందికి సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా చూడండి. ప్రతి జిల్లాకు కనీసం 1500 బెడ్లు ఉండేలా చూసుకోవాలి. అక్కడ సదుపాయాలు బాగా ఉండేలా చూసుకోండి. 108, 104 వాహనాలు ఒకేసారి 1060 ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ కూడా కొత్త వాహనాలే. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది. ఈ వెహికల్ ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న వారికి స్క్రీనింగ్ చేయాలి. ఇంటింటికీ సర్వే చేసి, ప్రతి ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్య వివరాలను క్యూఆర్ కోడ్ ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు చేయాలి. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యా«ధులున్న 40 ఏళ్లకు పైబడ్డ వారికి పరీక్షలు చేయాలి. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉంటాయి. ఈ మందులను వారికి అందించాలి. -
8న వైఎస్ఆర్ జయంతి వేడుకలు
విజయనగరం మున్సిపాలిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రా జశేఖరరెడ్డి జయంతి ఉత్సవాన్ని ఈ నెల 8న భారీగా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు స్థానిక రాజీవ్ క్రీడామైదానం లో మెగా రక్తదాన శిబిరంతో పాటు, వరుణ యాగం నిర్వహిస్తామని ఆ యన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా రక్తనిల్వల కొరత ఉన్నందున, ఆ రో జున పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పా టు చేస్తామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న అనావృష్టి నేపథ్యంలో వర్షాలు కురిసి అన్నదాతలో పాటు అన్ని వర్గాల ప్ర జలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాలు నిర్వహిస్తామన్నారు. ఆ రోజు నిర్వహించే రెండు కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
వైఎస్ఆర్ జయంతికి సేవా కార్యక్రమాలు
హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు పిలుపు ఇచ్చింది. ఈ నెల 8న వైఎస్ఆర్ 65వ జయంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలతోపాటు మహానేత విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని నిర్ణయించారు. వర్షాలు కురవనందున జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో వరుణ యాగాలు నిర్వహించాలని కూడా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఓ ప్రకటనలో వైఎస్ఆర్ సిపి కోరింది. ఆ మహానేత పేరు తలచుకుంటే ఒక్క పైసా కూడా ఎలాంటి పన్నులు విధించకుండా, ఆర్టీసి, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సాగించిన పాలన గుర్తుకు వస్తోందని ఆ పార్టీ పేర్కొంది. అలాగే ఆరోగ్యశ్రీ, 104, 108, ఫీజురీయింబర్స్‌మెంట్, 47 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి ఇంటింటి పథకాలు అనేకం గుర్తుకువస్తాయని వివరించింది. ఆధునిక సమాజ దేవాలయాలుగా చేపట్టిన అనేక ప్రాజెక్టుల నిర్మాణం గుర్తుకు వస్తాయని ఆ పార్టీ పేర్కొంది. ఏనాటికైనా తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ విధానాలే శ్రీరామ రక్ష అని పార్టీ అభిప్రాయపడింది. వైఎస్ఆర్ పాలనలో ఏటా వర్షాలు పడి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పంటలు పండి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేసింది. జూలై మొదటి వారంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో వర్షాలు లేవు. అన్ని జిల్లాలలో 40 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు - వడగాల్పులకు మరణాలు నమోదు అవుతున్నాయి. దాంతో జనం ఆ మహానేత పాలనను గుర్తుచేసుకుంటున్నారని పార్టీ తెలిపింది. ఈ పరిస్థితులలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని, వరుణ యాగాలు నిర్వహించాలని నేతలను, కార్యకర్తలను పార్టీ కోరింది.