రైతుల మేలు కోసమే జనతా బజార్లు | CM YS Jagan Says Janata Bazaars are for the benefit of the farmers | Sakshi
Sakshi News home page

రైతుల మేలు కోసమే జనతా బజార్లు

Published Thu, Jul 2 2020 5:55 AM | Last Updated on Thu, Jul 2 2020 5:55 AM

CM YS Jagan Says Janata Bazaars are for the benefit of the farmers - Sakshi

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇ–ప్లాట్‌ ఫాం, జనతా బజార్ల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కనీసం 30 శాతం వ్యవసాయోత్పత్తులకు స్థానికంగా మార్కెట్‌ కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. జనతా బజార్లలో పాలు, రొయ్యలు, చేపలు వంటి ఆక్వా ఉత్పతులను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఆర్బీకేల పరిధి, జనతా బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ రూపొందించాలి.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు మేలు చేకూర్చడానికే జనతా బజార్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతుల ఉత్పత్తులకు స్థానికంగా మార్కెటింగ్‌ కల్పించే చర్యల్లో భాగంగానే వీటిని తీసుకువస్తున్నామని చెప్పారు. జనతా బజార్ల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జనతా బజార్లు, ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ ఫాం ఏర్పాటు ప్రతిపాదనలు, వాటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఏ ప్రభుత్వమూ రైతుల గురించి ఇంత సీరియస్‌గా ఆలోచించలేదని, ఇప్పుడు రైతులను నష్టాల నుంచి గట్టెక్కించి వారికి ఆదాయాలు రావాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తోందని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

ఆక్వా ఉత్పత్తుల నిల్వకూ గోడౌన్లు
► ఆర్బీకేల నిర్వహణ కోసం మండల స్థాయిలో ఒక అధికారిని నియమించుకునే ఆలోచన చేయాలి. మండలంలోని ఆర్బీకేల పరిధిలో వ్యవసాయోత్పత్తులను ఇ–ప్లాట్‌ఫాం మీదకు తీసుకొచ్చే ప్రక్రియలో సమన్వయ పరచడానికి ఆ అధికారి ఉపయోగపడతారు. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కూడా దీనికి దోహదపడతారు. ఈ విధానాలపైన మరింత నిశితంగా పరిశీలించి చక్కటి ప్రణాళిక రూపొందించాలి. 
► ఆక్వా సాగు ప్రాంతాల్లో కూడా ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవసరమైన గోడౌన్ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి లక్ష్యంగా ఆర్బీకేల పరిధిలో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు, గ్రేడింగ్‌ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలి. 
► అదే సమయానికి జనతా బజార్లు, వాటికి అవసరమైన ఫ్రీజర్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి పంటలకు కల్పించాల్సిన కనీస గిట్టుబాటు« ధరలపై చర్యలు తీసుకోవాలి. ఆ ధరలకు పంటలు కొనుగోలు చేసేలా చూడాలి. 
► వచ్చే రబీలో క్రాప్‌ ప్లానింగ్‌పై.. అవసరమైన పంటలకు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలి. ఏయే పంటలకు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం చేయించాలి.

రైతులకు మంచి జరిగేలా చూడాలి
► రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులు వచ్చేలా చూడాలి. జనతా బజార్లకు, ఆర్బీకేల ద్వారా ఇ–ప్లాట్‌ఫాం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏక కాలంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. 
► రైతులు తమ పంటను అమ్మకుంటున్నప్పుడు ధరలు పడిపోతాయి.. తర్వాత రెండు మూడు వారాలకు మళ్లీ ధరలు పెరుగుతాయి. ఈ దేశంలో రైతుకున్న వ్యథ ఇది. దీన్ని మనం సరి చేయాలి. రైతుకు అండగా నిలవాలి. ఆ దిశగా ఆలోచనలు చేయాలి.  
► రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడంతో పాటు, వినియోగదారులకు మేలు చేకూర్చడమే జనతా బజార్ల ఉద్దేశం. జనతా బజార్ల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలి. ఆ ఉత్పత్తులు జనతా బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. 
► ప్రతి ఆర్బీకే పరిధిలో కోల్డ్‌ స్టోరేజీ, గోడౌన్లు తీసుకు రావాలన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నాం. గ్రేడింగ్‌ కూడా ఆర్బీకేల పరిధిలో జరిగేలా చూస్తున్నాం. వీటి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. 
► ఈ మౌలిక సదుపాయాలు మనం అనుకున్న విధానాలన్నీ అమల్లోకి తీసుకురావడానికి తోడ్పడతాయి. ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంకు ఇవన్నీ చాలా అవసరం. 

ప్రకటించిన ధరకే పొగాకు కొనుగోలు 
► రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పొగాకు కొనుగోలులో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అందువల్ల కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల జాబితాను ప్రకటించాలి. లో గ్రేడ్‌  పొగాకులో ఇంకా తక్కువ స్థాయి పొగాకుకూ రేటు ప్రకటించాలి. 
► కొనుగోలు కేంద్రానికి సరుకు తెచ్చిన రైతు.. ఆ సరుకును తిరిగి తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదు. ప్రభుత్వం ప్రకటించిన రేటు కన్నా తక్కువ ధరకు కొనుగోలు కాకుండా చూడాలి.
► ఈ సమీక్షలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement