సాక్షి, తాడేపల్లి: ‘కరోనా లాక్‌డౌన్‌తో బతకడం కష్టమైంది. ఆటోలు, టాక్సీలు తిరగక ఆ కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వారికి మేలు చేయడం కోసం నాలుగు నెలల ముందే వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్ వాహనమిత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. (రెండో విడత YSR వాహన మిత్ర ప్రారంభం)
అనంతరం పలు జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్‌లో నమోదు చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, నిబంధనలను పాటించాలని రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే....
మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను
‘ఆటో, టాక్సీ, క్యాబ్ సొంతంగా కొని బతుకుతున్న అన్నదమ్ములకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. గత ఏడాది అక్టోబరు 4న చేయగా, ఈ ఏడాది జూన్ 4నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2018 మే నెలలో ఏలూరులో పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చాను. ప్రతి జిల్లాలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్(ఎఫ్‌సీ) కోసం ఒకేసారి దాదాపు రూ.10 వేల ఖర్చు చేయాల్సి రావడం, ఆ తర్వాత రోజుకు రూ.50 ఫైన్ ఎలా కడతారని ఆలోచించి, ఏలూరు సభలో మాట ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక అమలు చేశాను. ఈసారి మళ్లీ మీ తమ్ముడిగా, అన్నగా సహాయం చేస్తున్నాను. (ఆటోవాలా.. మురిసేలా)
ఈ నెలలోనే నేతన్న నేస్తం..
గత ఏడాది దాదాపు రూ.236 కోట్లు ఖర్చు చేయగా, ఈ అన్నదమ్ముల కోసం ఈ ఏడాది రూ.262 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. అన్ని వర్గాలకు సేవలందించే విధంగా క్యాలెండర్ ప్రకటించాం. ఇవాళ ఈ కార్యక్రమం కాగా, 10న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు సహాయం. ఆ తర్వాత 17న నేతన్న నేస్తం. 24న కాపు నేస్తం. 29న ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత లబ్ధి ఉంటుంది. పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిది. ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు.
పూర్తి పారదర్శకతతో ఈ పథకం అమలు
ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి రాకపోతే ఆందోళన చెందవద్దు. నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైతే చాలు పథకం వర్తింప చేయాలి. కాబట్టి ఎక్కడైనా, ఎవరైనా మిగిలిపోతే.. వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్లి, పథకం అర్హతల గురించి తెలుసుకోండి. అర్హులైతే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల 4న సహాయం చేస్తాం. లేకపోతే స్పందన వెబ్‌సైట్‌లో రిజస్టర్ చేసుకోండి. ఎంక్వైరీ చేసి వచ్చే నెల 4న ఇస్తాం. పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా పథకం అమలు చేస్తాం. ఈ మొత్తాన్ని వాహనం ఇన్సూరెన్సు, ఎఫ్‌సీ కోసం ఖర్చు చేయండి. ఎందుకంటే ప్రయాణికులు మిమ్మల్ని నమ్మి వాహనం ఎక్కుతారు’ అంటూ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment