సాక్షి, అమరావతి : ఒకపక్క ఆశ్చర్యం.. మరోవైపు ఒకింత గర్వం.. బీసీల సంక్షేమానికి ఏడాదిన్నరలోనే ఇన్ని చేశారా? అని అనిపిస్తున్నా.. ముమ్మటికీ అదే నిజమని లబ్ధిదారుల ఖాతాల్లో సాయాన్ని జమచేసి గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుజువు చేశారు. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియచేస్తున్నామని చెప్పారు. గురువారం విజయవాడలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంత్రి’ కార్యక్రమంలో 18 నెలలుగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేసిందో, ఎన్ని పథకాలు తెచ్చిందో వివరించారు. ఇది జగనన్న ప్రభుత్వమని.. మీ అందరి ప్రభుత్వమని.. మీ అందరి కోసం ఆలోచించి చేస్తున్న ఖర్చు ఇదంతా అని పేర్కొన్నారు.
అమ్మ ఒడి...
రాష్ట్రంలో 82 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలిగేలా 43 లక్షల మంది తల్లులకు ఏటా రూ.6,500 కోట్లు ఇస్తున్నాం. వీరిలో బీసీలు 19.66 లక్షల మంది ఉన్నారు. జనవరి 9న రెండోసారి అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి ఇవ్వబోతున్నాం.
వైఎస్సార్ రైతు భరోసా...
ఈ పథకంతో దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. ఇందు కోసం ఇప్పటికే రూ.6,750 కోట్లు ఖర్చు చేశాం. వీరిలో బీసీ రైతు కుటుంబాలు 23.69 లక్షలు కాగా ఈ రెండేళ్లలో వారికి రూ.6,140 కోట్లు లబ్ధి చేకూర్చాం.
రైతులకు సున్నా వడ్డీ పథకం..
ఇందుకోసం ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ.1,207 కోట్లు కాగా లబ్ధిదారులు 14.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో బీసీలు 7.14 లక్షల మంది కాగా వారికి రూ.511 కోట్ల మేర మేలు చేశాం.
ఉచిత పంటల బీమా..
ఈ పథకంలో 9.48 లక్షల మంది రైతుల కోసం మొత్తం రూ.1,252 కోట్లు ఖర్చు చేయగా వీరిలో బీసీ రైతులు 4.48 లక్షల మంది ఉన్నారు. వారికి ఈ పథకం ద్వారా రూ.588 కోట్ల మేర సాయం అందించాం.
ఇళ్ల స్థలాల పట్టాలు..
పేదలందరికీ ఇళ్లు అందించటాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు కూడా కాకముందే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఒక యుద్ధమే చేశాం. ఈనెల 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వచ్చి వాటిని అందజేస్తారు. ఇళ్ల పట్టాలు తీసుకోనున్న వారిలో 15.92 లక్షల మంది బీసీ అక్క చెల్లెమ్మలు ఉన్నారు. నేరుగా వారి పేరుతోనే డీపట్టా ఇస్తున్నాం. కోర్టు నుంచి అనుమతి రాగానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం.
టిడ్కో ఇళ్లు..
మొత్తం 2.62 లక్షల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తున్నాం. వీరిలో 1.53 లక్షల మంది బీసీలే.
వైఎస్సార్ నేతన్న నేస్తం..
ఈ పథకంలో 81 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. 18 నెలల్లో రూ.384 కోట్లు ఖర్చు చేశాం. వారంతా బీసీలే.
వైఎస్సార్ మత్స్యకార భరోసా..
ఈ పథకంలో మొత్తం రూ.210 కోట్లు ఖర్చు చేయగా 1.07 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. వీరు కూడా బీసీలే.
జగనన్న చేదోడు..
రజకులు, నాయీ బ్రాహ్మణ సోదరులు, దర్జీలకు జగన్నన్న చేదోడు పథకం అందించాం. మొత్తం లబ్ధిదారులు 2.98 లక్షలు కాగా వీరిలో బీసీలు 2.27 లక్షల మంది ఉన్నారు. వీరికి ఈ పథకం ద్వారా రూ.227 కోట్లు అందచేశాం.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ..
ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ 9.67 లక్షల మంది లబ్ధిదారులపై రూ.2,340 కోట్లు ఖర్చు చేశాం. వీరిలో బీసీలు 5.24 లక్షల మంది కాగా వారి కోసం రూ.1,255 కోట్లు వెచ్చించాం.
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా...
ఈ పథకంలో 2.61 లక్షల మంది లబ్ధిదారుల కోసం రూ.165 కోట్లు ఖర్చు చేశాం. లబ్ధిదారుల్లో బీసీలు 1.38 లక్షల మంది కాగా వారి కోసం రూ.87 కోట్లు వ్యయం చేశాం.
వైఎస్సార్ పెన్షన్ కానుక..
ప్రతి నెలా ఒకటో తారీఖునే సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందిస్తున్నాం. ఈ పథకంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 61.94 లక్షలు కాగా 18 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు ఇచ్చాం. వీరిలో బీసీ కుటుంబాలు 30.27 లక్షలు కాగా రూ.12,230 కోట్లు పెన్షన్లు కింద చెల్లించాం.
వైఎస్సార్ ఆసరా..
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఉన్న రుణాలు రూ.27,163 కోట్లు కాగా అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు విడతల్లో ఆ మొత్తం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినట్లుగానే మొదటి దఫాలో రూ.6,792 కోట్లు ఇచ్చాం. మొత్తం లబ్ధిదారులు 87.74 లక్షలు కాగా వారిలో 42.60 లక్షల మంది బీసీ అక్కచెల్లెమ్మలున్నారు. వారికి మొదటి విడతలో రూ.3,260 కోట్ల సాయం అందించగా నాలుగేళ్లలో మొత్తం రూ.13,040 కోట్లు బీసీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం.
సున్నా వడ్డీ..
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.1,400 కోట్లు అందిస్తున్నాం. ఈ పథకంలో మొత్తం లబ్ధిదారులు 90.37 లక్షలు కాగా వారిలో బీసీ అక్క చెల్లెమ్మలు 48.39 లక్షల మంది ఉన్నారు. వారికి ఈ పథకం ద్వారా రూ.720 కోట్లు ప్రయోజనం చేకూరుతోంది.
వైఎస్సార్ చేయూత..
ఈ పథకంలో అక్క చెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తాం. 24.56 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తొలి ఏడాది రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఆ డబ్బుతో వారికి నెల నెలా ఆదాయం లభించేలా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద కంపెనీలు ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ, అల్లానా, హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్, అమూల్‌తో ఒప్పందాలు చేసుకున్నాం. డెయిరీలు, మేకల, గొర్రెల పెంపకం, రీటెయిల్ షాపుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నాం. వీరిలో బీసీ అక్కచెల్లెమ్మలు 14.81 లక్షల మంది కాగా వారికి రూ.2778 కోట్ల మేర ప్రయోజనం కలుగుతోంది.
జగనన్న విద్యా దీవెన..
ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.3, 857 కోట్లు ఇవ్వగా 18.57 లక్షల పిల్లలకు మేలు జరుగుతోంది. వీరిలో బీసీ విద్యార్థులు 9.30 లక్షల మంది కాగా వారికి రూ.1,684 కోట్ల మేలు లబ్ధి కలుగుతోంది.
జగనన్న వసతి దీవెన..
ఈ పథకం ద్వారా రూ.1221 కోట్లతో 15.57 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చగా వీరిలో బీసీ విద్యార్థులు 7.43 లక్షల మంది ఉన్నారు. వారికి మొత్తం రూ.553 కోట్లు ఇచ్చాం.
జగనన్న విద్యా కానుక..
ఈ పథకంతో 42.34 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం. బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. ఇందుకోసం రూ.648 కోట్లు ఖర్చు చేస్తుండగా వీరిలో బీసీ విద్యార్థులు 22 లక్షల మంది ఉన్నారు.
జగనన్న గోరుముద్ద..
మధ్యాహ్న భోజన పథకంతో 32.52 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుండగా వీరిలో బీసీ విద్యార్థులు 17.23 లక్షల మంది ఉన్నారు.
వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ..
ఈ పథకంలో మొత్తం 30.16 లక్షల మంది పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మేలు జరుగుతోంది. వీరిలో 14.78 లక్షల మంది బీసీలున్నారు.
వైఎస్‌ఆర్ వాహనమిత్ర..
ఈ పథకంతో 2.75 లక్షల మందికి రూ.513 కోట్ల మేర ఆర్థిక సహాయం చేయగా వీరిలో బీసీ లబ్ధిదారులు 1.22 లక్షల మంది ఉన్నారు. వారికి ఇప్పటి వరకు రూ.230 కోట్ల సహాయం అందచేశాం.
జగనన్న తోడు
దాదాపు 9 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ వడ్డీ భారం ప్రభుత్వం భరిస్తోంది. వీరిలో బీసీలు 4.34 లక్షల మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment