హోదాను రద్దు చేయలేదు.. ఇదిగో ఆధారం : సీఎం జగన్‌ | CM YS Jagan Speech In NITI Aayog | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : సీఎం వైఎస్‌ జగన్‌

Published Sat, Jun 15 2019 6:04 PM | Last Updated on Sat, Jun 15 2019 7:03 PM

CM YS Jagan Speech In NITI Aayog - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఐదో సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్‌కు గల అర్హతలను ఆయన వివరించారు.

(చదవండి : ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్‌ కీలక భేటీ)

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేం‍ద్ర మోదీని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. గతంలో బీజేపీ తన మేజిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిని విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యే​క హోదా ఇస్తూ గత కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని చెబుతూ.. ప్లానింగ్‌ కమిషన్‌ అబిజిత్‌ సేన్‌ లేఖను జతచేశారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరారు. సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చగలదు
విభజనలో ఏపీకి  తీవ్ర నష్టం కలిగింది. 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారు. అత్యంత ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఐటీ సెక్టార్ హైదరాబాద్‌కి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువ. ఈ నష్టాన్ని పూడ్చడానికి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. విభజన నాటికి రూ.97 వేల కోట్లుగా ఉన్న మా అప్పు నేటికి రూ.2.59 లక్షల కోట్లకు చేరింది. అప్పుల్లో అసలు, వాటిపై వడ్డీలకు కలిపి ఏడాది రూ. 40 వేల కోట్ల భారం మా రాష్ట్రంపై పడుతోంది. ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోయాయి. మా యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాన్ని ఇస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి జరుగుతుంది. 

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హోదా ప్రస్తావన ఉంది
గత ఐదేళ్లలో అవినీతితో కూడిన దుష్పరిపాలన, చిత్తశుద్ధిలేని పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. మౌలిక రంగాల్లో పెట్టుబడుల లేమి, విద్యా, వైద్య రంగాల పతనావస్థ పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే మా జీవధారగా మిగిలింది. ప్రత్యేక హోదాపై అనేక అపోహలు కూడా ప్రచారంలో కొనసాగుతున్నాయి. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను మీ ముందు ఉంచుతున్నాను. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా 2014 మార్చి 2న అప్పటి కేంద్ర కేబినెట్ ప్లానింగ్ కమిషన్‌కి సిఫార్సు చేస్తూ తీర్మానించింది. అప్పటి నుంచి 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే నాటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా హోదా ఇవ్వాలని అడుగుతాయన్న వాదన కూడా ప్రచారంలో ఉంది. రాష్ట్ర విభజన జరగడానికి ముందస్తు షరతుగా మాకు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాకి అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంటులో ఉన్నారు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన ఉంది. ఇందుమూలంగా మనవి చేయునది ఏమనగా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement