
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఐదో సమావేశంలో ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్‌కు గల అర్హతలను ఆయన వివరించనున్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరనున్నారు. పరిపాలనలో అన్ని స్థాయిల్లో పారదర్శకత పెంచడానికి, అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించనున్నారు.
తలసరి ఆదాయంలో వెనుకబాటే
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరమని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. విభజన తరువాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని, ప్రగతి పరుగులో వెనుకంజలో ఉందని తెలియజేస్తారు. తలసరి ఆదాయంలోనూ బాగా వెనుకబడిందని వెల్లడిస్తారు. 2015–16లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,397 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411 అని సీఎం వివరించనున్నారు. అక్షరాస్యతలో, మాతా శిశు మరణాలను నియంత్రించడంలోనూ ఏపీ వెనుకబాటులో ఉందని సీఎం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించండి
గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పంటల బీమా ప్రీమియం కింద చెల్లిస్తున్న సొమ్ము పరిహారంగా ఇస్తున్న సొమ్ము కంటే ఎక్కువగా ఉంటోందని, దీన్ని సరిచేయడానికి కేంద్రం చెల్లించే ప్రీమియం వాటాను రాష్ట్రానికి గ్రాంట్‌గా ఇచ్చేస్తే రాష్ట్ర సర్కారు రైతులకు న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో కోరనున్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తరువాత ఆ పంటల ప్రొక్యూర్‌మెంట్‌లో ఆంక్షలు విధించరాదని, మొత్తం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి విన్నవించనున్నారు. రైతుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసే సొమ్మును పాత బకాయిల కింద బ్యాంకులు సర్దుబాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కోరనున్నారు.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రానికి విన్నవిస్తారు. తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా జాతీయ సగటు వాటాతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉందని గుర్తుచేస్తారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలంటే తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల అమలుకు తీసుకున్న చర్యలను నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించనున్నారు. పరిపాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, అవినీతి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. టెండర్లలో పారదర్శకతకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు సీబీఐకి అనుమతి వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment