శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయి, ఇబ్బందులు పడుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ముందుగా విజయవాడ నుంచి సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికారిక నివాసమైన నంబర్ 1, జన్‌పథ్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 5.15 గంటలకు నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయానికి చేరుకొని ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ఉన్నారు.
హోదా ఆవశ్యకతను వివరించాం..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన ఆవశ్యకతను అమిత్ షాకు వివరించినట్టు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అమిత్ షాతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న విభజన చట్టంలోని పలు అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు వంటివి కేంద్ర హోం శాఖ పరిధిలోనే ఉన్నాయి. వీటి అమలుకు సంబంధించి అమిత్ షాకు ఒక లేఖ సమర్పించాం. ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేశాం. హోదా అవసరం రాష్ట్రానికి ఎంత ఎక్కువగా ఉందో వివరించాం. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్ర సాయం కావాలని అభ్యర్థించాం. ఏపీకి ప్రత్యేక హోదా అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలుకు సానుకూల ప్రతిపాదన చేయాలని అమిత్ షాను కోరాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ పదవిపై ఊహాగానాలు అనవసరం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. ఈ ఊహాగానాలు అనవసరం అని వైఎస్ జగన్ బదులిచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గానీ, తాము గానీ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని అన్నారు. అమిత్ షాతో సమావేశంలో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరుగుతుందని పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పార్టీ ఎంపీలందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేస్తారన్నారు. శుక్రవారం రాత్రి సీఎంను ఆయన బస చేసిన నంబర్ 1, జన్‌పథ్ నివాసంలో పలువురు నేతలు కలిశారు. శనివారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో జగన్ పాల్గొంటారు.
ప్రత్యేక హోదానే మా అజెండా
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రత్యేక హోదానే తమ ప్రధాన అజెండా అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో వివరిస్తామన్నారు. దేవుడి దయతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment