మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy PressMeet At Delhi | Sakshi
Sakshi News home page

ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం: వైఎస్‌ జగన్‌

Published Sun, May 26 2019 2:32 PM | Last Updated on Sun, May 26 2019 4:09 PM

YS Jagan Mohan Reddy PressMeet At Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆదివారం ఆయన న్యూఢిల్లీలో ఏపీ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని జగన్‌ పేర్కొన్నారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పరిస్థితుల్ని ప్రధానికి వివరించామన్నారు.

బాబు పాలనలో రూ.2లక్షల 57 వేలకోట్ల అప్పులు
రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2 లక్షల 57వేల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్‌ తెలిపారు. అప్పులపై ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.

హోదా గురించి అడుగుతూ ఉంటా
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు చాలావరకూ అమలు చేయాల్సి ఉందన్నారు. ఒకవేళ బీజేపీకి 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే...హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతు ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. అందుకే ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామన్నారు.

దశలవారీగా మద్యపాన నిషేధం
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మద్యపాన నిషేధంపై స్పష్టంగా చెప్పామని అన్నారు. మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాకే 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతామన్నారు.

మేనిఫెస్టో పవిత్ర గ్రంధం
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావిస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలయ్యేలా చూస్తామని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. విశ్వసనీయతకు ప్రజలు పట్టంగట్టారని, దాన్ని సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తామన్నారు. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తామన్నారు. 

కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాను. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాల కోసం భేటీ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు నిలుస్తామన్నారని తెలిపారు.

వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం
ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామన‍్నారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం
అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. ఫలానా చోట రాజధాని వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు. ప్రకటనకు ముందు రాజధాని వేరేచోట వస్తుందని ప్రచారం చేసి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో  బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. ఆ తర్వాత రాజధానిని ప్రకటించారు. హెరిటేజ్‌ కంపెనీ సైతం 14 ఎకరాలు భూమి కొనుగోలు చేసింది. ల్యాండ్‌ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారు. ఇక్కడ ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డాడరు. ఇదంతా మామూలు స్కామ్‌ కాదు. సంచలనాత్మకమైన కుంభకోణం. వ్యక్తిగతంగా చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. 

వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ
మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ నెల 30న తాను మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్‌ తెలిపారు. డే వన్‌ నుంచి ఏం చేయబోతామనేది ప్రమాణస్వీకారం రోజు తెలియచేస్తామని అన్నారు.

యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి
పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత టెండర్లు రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ చేసి గతంలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అలాగే చేస్తాం. సత్వరమే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కై నాపై కేసులు
నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. అప్పట్లో ఏ మంత్రికిగాని, అధికారులకు ఫోన్‌ చేయలేదు. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లోనే లేను. బెంగళూరులో ఉన్నాను. అమ్మానాన్నలను చూసేందుకు మాత్రమే హైదరాబాద్‌ వచ్చేవాడిని. నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. నాన్న చనిపోయాక కాంగ్రెస్‌ను వ్యతిరేకించాకే నాపై టీడీపీ ప్రోద‍్భలంతో కేసులు పెట్టారని అన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ప్రధానిని కలిసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూ ఉంటా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement