
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ రానున్న వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో కలవనున్నారు.
అనంతరం శనివారం ఉదయం 10 గంటలకు నంబర్ 1, జన్‌పథ్‌లో జరిగే వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు.