‘స్పందన’పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష | CM YS Jagan Video Conference With Collectors SPs On Spandana Program | Sakshi
Sakshi News home page

‘స్పందన’పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Published Tue, Jun 9 2020 2:06 PM | Last Updated on Tue, Jun 9 2020 7:31 PM

CM YS Jagan Video Conference With Collectors SPs On Spandana Program - Sakshi

సాక్షి, తాడేపల్లి: సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్నవాళ్లు.. ఎడ్లబండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుక తెచ్చుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయంలో ఇందుకు సంబంధించి అనుమతులు తీసుకోవచ్చని వెల్లడించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇసుక రీచ్‌లను తెరవాలని అధికారులను ఆదేశించారు. జూన్ చివరి నాటికి రోజుకు 3లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 

అదే విధంగా వర్షాలు కురిసే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త వనరులను గుర్తించి మరిన్ని ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి’’అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.(పది రోజుల్లోనే పింఛన్‌ కార్డు: సీఎం జగన్‌)

నాడు- నేడు కార్యక్రమంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి
రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చేవారన్న సీఎం జగన్‌.. ఇప్పుడు ఆ సంఖ్య 54.5 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి 60లక్షల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా... 55వేల అంగన్‌వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగ్‌లు కట్టాలని.. అంగన్‌వాడీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  పట్టణ, నగరాల్లో వైఎస్సార్ క్లీనిక్స్‌పై మ్యాపింగ్ చేయబోతున్నారు..  వీటి స్థలాలు గుర్తించే పనిని యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. నాడు-నేడు కార్యక్రమంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు.

కోవిడ్‌: ఐసోలేషన్ సదుపాయాలపై దృష్టి పెట్టండి
‘‘కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు బాగా పనిచేశారు. కరోనా నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు తొలగించాలి. అనుమానం రాగానే పరీక్షలు చేయించుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.  85శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడంతో తగ్గిపోతుంది. కేవలం 2శాతం మాత్రమే మరణాలు రేటు ఉంది. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్ సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.(పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు)

15 కొత్త మెడికల్‌ కాలేజీలు
స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్‌ పర్యవేక్షించాలి. 15 కొత్త మెడికల్ కాలేజీలను కట్టబోతున్నాం. ఒక్కో మెడికల్ కాలేజీకి 50 ఎకరాల స్థలం కావాలి. కొత్త మెడికల్ కాలేజీలకు అవసరమైన స్థలాలను గుర్తించాలి

మద్యం దుకాణాలు తగ్గించాం
లిక్కర్‌ వినియోగం తగ్గించడానికి అన్నిరకాల చర్యలూ తీసుకున్నామని సీఎం జగన్‌ అన్నారు. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశామని.. 33శాతం మద్యం దుకాణాలు తగ్గించామని తెలిపారు. మద్యం విక్రయించే వేళలను బాగా తగ్గించామని.. షాక్‌ కొట్టే రీతిలో రేట్లు పెంచామన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు.. మద్యం అక్రమ రవాణా, తయారీ జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నారు. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరు ఉన్నా కూడా ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement