కోస్టుగార్డు మరింత బలోపేతం
- విమానాశ్రయంలో ఐదెకరాల నేవీ స్థలం లీజుకు..
- కోస్టుగార్డు విమానాలు, హెలికాప్టర్ స్థావరాలకు ప్రత్యేక సదుపాయాలు
- ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదం
గోపాలపట్నం: తూర్పుతీర ప్రాంతానికి రక్షణగా ఉన్న కోస్టుగార్డు సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ సంస్థకు ప్రత్యేక సదుపాయాల కల్పనకు నడుంకట్టింది. దీనికోసం విశాఖ విమానాశ్రయంలో నేవీ ఆధీనంలో ఉన్న ఐదెకరాల స్థలాన్ని లీజుకిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇక నుంచి అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
ఇతరమార్గాలకంటే జలమార్గంలో విదేశీ చొరబాటుదారుల ప్రవేశానికి ఆస్కారం దేశానికి అత్యంత ప్రమాదకరం. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బలమైన శక్తే భారీతీయ కోస్టుగార్డు సంస్థ. ఈ సంస్థ చొరబాటుదారులను రానీయపోవడమే కాకుండా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వున్న సమయాల్లో నేవీతో పాటు శ్రమించే కేంద్ర రక్షణ విభాగం ఇది. ఢిల్లీ హెడ్‌క్వార్టర్సుగా చెన్నై రీజియన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తీర ప్రాంతాలకు ఆయువుపట్టుగా ఉన్న ఈ సంస్థ బాధ్యత అంతాఇంతా కాదు.
నౌకలతో పాటు హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు కూడా ఈ సంస్థకు ఉంటాయి. అయితే విమానస్థావరానికి కోస్టుగార్డుకంటూ ప్రత్యేకంగా స్థలం లేదు. విశాఖ విమానాశ్రయంలో నేవీ ఆధీనంలో ఉన్న స్థలాన్ని ఎంతో కాలంగా వినియోగిస్తోంది. కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ సంస్థ మరింత అప్రమత్తమైంది. దీనికంటూ ప్రత్యేక వైమానిక స్థలాన్ని నిర్దేశించుకోవాలని నిర్ణయింది. అయితే నేవీ ఆధీనంలో వుండడంతో దీనికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు కుదరలేదు.
దీనిపై కేంద్ర రక్షణ శాఖ అధికారులు స్పందించారు. నేవీ ఆధీనంలో ఉన్న ఐదెకరాల స్ధలాన్ని కోస్టుగార్డు సంస్థకు లీజుకివ్వాలని ప్రతిపాదించారు. కొద్దిరోజులక్రితం ప్రధాని మోది అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించారు. విమానాశ్రయంలో రన్‌వే ఉంది. దీనికి సమీపంలో ఈ స్థలం లీజుకు కేటాయించడం వల్ల కోస్టుగార్డు వ్యవస్థ ప్రత్యేక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుందని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు.