కత్తి లేకుండానే.. కాయ్ రాజా కాయ్
సంక్రాంతి సందర్భంగా పందెంరాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. కోడిపందేల రూపంలో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కత్తి కట్టకుండానే పందేలు నిర్వహించడం ఈసారి స్పెషాలిటీ.
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, చాగల్లు మండలాల్లో కోడిపందేలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భీమవరంలో కోడిపందేల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిని చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కత్తి కట్టకుండానే జరుపుతున్న కోడిపందేలను తిలకిస్తున్నారు. కత్తి కడితే జంతుహింస కిందకు వస్తుందన్న అనుమానంతోనే ఈసారి కత్తులు లేకుండా పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కత్తి కడితే నిమిషాల్లోనే పందెం అయిపోతుందని, లేకపోతేనే ఎక్కువ సేపు సాగి అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని కూడా అంటున్నారు.
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో, తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలోనూ కోడిపందేల, గుండాటలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు రాకపోవడంతో కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగుళ్లో మునిగి తేలుతున్నరు.
కాకినాడ రూరల్లో కోడిపందేలపై పోలీసులు దాడులు జరిపారు. కొవ్వాడలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందేలపై ఇంద్రపాలెం పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లు, కోళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా కోడిపందేల అనుమతుల విషయమై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ నేత కనుమూరి రామకృష్ణంరాజు భీమవరంలో లాంఛనంగా కోడిపందేలను ప్రారంభించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా కోళ్లను చేతబట్టుకొని పందేలకు సై అనిపించారు.