సాంబమూర్తినగర్ (కాకినాడ) :ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు పర్యవేక్షకులుగా తహశీల్దార్లు, ఎంపీడీఓలను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఉత్తర్వులను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. రవిచంద్ర కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కొంతమంది వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారని, నీతూ ప్రసాద్ ఏ శాఖలోనూ అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని వైద్య శాఖలోనే అమలు చేశారని ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఎవరు కలెక్టర్‌గా పనిచేసినా వైద్య ఉద్యోగులను దొంగలుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పవర్ మొత్తాన్ని ఐటీడీఏ పీఓకు బదలాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా వారు తప్పుబడుతున్నారు. ఒక పక్క సొంత శాఖ లోని అధికారుల ఒత్తిడి, మరో పక్క ఇతర శాఖల అధికారుల పెత్తనం వల్ల తాము మానసిక వేదనకు గురవుతున్నామని పేర్కొంటున్నారు. అయితే రెవెన్యూ శాఖ వాదన మరోలా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విపత్కర పరిణామాలు సంభవిస్తున్నాయని, అయితే వైద్య, ఆరోగ్య శాఖ మరో భాగమేమీ కాదని ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు అన్ని శాఖలూ కలిసే ఉండేవని, ఆయన వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవల నిమిత్తం వైద్య శాఖను వేరుచేశారని చెబుతున్నారు.
తాము వైద్య ఉద్యోగులపై పెత్తనం చలాయించేదేమీ లేదని, వారి పనితీరు మెరుగుపరిచేందుకు పర్యవేక్షకులుగా మాత్రమే వ్యవహరిస్తున్నామని పేర్కొంటున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ఇతర వ్యాధులు ప్రబలి అత్యవసర పరిస్థితులు ఏర్పడడానికి క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, కలెక్టర్ వారిపై పర్యవేక్షకులుగా రెవెన్యూ అధికారులను నియమించారని చెబుతున్నారు. అయితే దీనిని వైద్య ఉద్యోగులు వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సావిత్రమ్మకు వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేకుంటే విధులు బహిష్కరించి వివిధ రూపాల్లో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఆరోగ్యశాఖ ప్రధాన డిమాండ్లివే...
ఇతర శాఖల పెత్తనంతో కూడిన ప్రత్యేకాధికారి నియామక ఉత్తర్వులు రద్దు చేయాలి.
పర్యవేక్షణకు వైద్య శాఖ అధికారులను మాత్రమే నియమించాలి.
బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి.
వైద్య సిబ్బందిని బహిరంగంగా విమర్శించే విధానాన్ని విడనాడాలి.
సిబ్బంది గౌరవం పెంచేలా చర్యలు చేపట్టాలి.
అనవసరపు మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లకు స్వస్తి పలకాలి.
జాబ్‌చార్ట్ విధానాన్ని మాత్రమే కొనసాగించాలి.
ఆధార్ సీడింగ్ నిమిత్తం వైద్య సిబ్బందిని బ్యాంకుల చుట్టూ తిప్పే విధానాన్ని విడనాడాలి.
ఏజెన్సీలో అడిషనల్ డీఎంహెచ్‌ఓకే అధికారాలు కల్పించాలి.
కోల్డ్‌వార్
Published Wed, Apr 1 2015 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement