
భువనేశ్వర్: కేరళలో నిఫా వైరస్ మాదిరిగానే ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ప్రజలను వణికిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు.
సుందర్‌గఢ్, బర్గఢ్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని అన్నారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని వారు తొందరగా ఈ వ్యాధికి గురవుతారు. జ్వరం, పురుగు కుట్టిన చోట చర్మంపై ఎశ్చర్ అనే నల్ల మచ్చ ఏర్పడటం దీని లక్షణాలు.