గంటా, అయ్యన్నల మధ్య ముదురుతున్న రగడ
మొన్నటిదాకా ఒకరిపై ఒకరు కారాలు..మిరి యాలు నూరుకున్నవారు హఠాత్తుగా చెట్టపట్టాలేసుకుని వేదికపై కనిపించగానే చూసిన వారు నోరెళ్లబెట్టారు. ఈ దోస్తీ కాస్త ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికల ఫలితమేనన్నది పార్టీ వర్గాల భోగట్టా. అయితే ఈ సఖ్యత ఉత్తమాటేనని తాజాగా మరోసారి రుజువైంది.
విశాఖపట్నం: జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోవడం ఆ పార్టీవర్గాలకే మింగుడుపడడం లేదు. జిల్లా మం త్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య రగడ ముదురుతోంది. జిల్లా మంత్రులుగా సఖ్యతగా మెలగాలని, వీధినపడితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.
గంటాను రచ్చకీడ్చమే అయ్యన్న లక్ష్యంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం తన ఓటమికి జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు రూ.2 కోట్లు ఖర్చు చేసారంటూ అయ్యన్నపాత్రుడు పరోక్షంగా గంటాపై ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. తాజాగా ప్రత్యూష ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు లభించిన టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గంటాపై అయ్యన్న బహిరంగ యుద్ధానికి దిగారు.
నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎకరా 50 సెంట్లు ఖాళీ స్థలంలో మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి గంటాకు చెందిన ప్రత్యూష ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో పాటు, కాశీ ఆసోసియేట్స్‌కు టెండర్ ఖరారు అయింది. తన ఇలాకా గంటా మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి పొందడమే అయ్యన్న అక్కసుకు కారణంగా కనిపిస్తోంది. ఆదివారం ఈ విషయమై అయ్యన్న బహిరంగంగానే గంటాపై ఆరోపణలు చేశారు.
విశాఖలో గ్రంథాలయ సంస్థ స్థలాన్ని స్వాహా చేసేందుకు గంటా చేసిన ప్రయత్నాలు గవర్నర్ జోక్యంతో అడ్డుకట్ట పడ్డాయి. ఇదే విధంగా నర్సీపట్నంలో కోట్ల రూపాయల విలువ చేసే ఆర్టీసీ ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అయ్యన్న ఆరోపిస్తున్నారు. ఈ టెండర్‌ను రద్దు చేయాలని, లేకుంటే నిర్మాణ పనులను కార్యకర్తలతో అడ్డుకుంటామని ప్రకటించారు. కాగా ఇద్దరు క్యాబినెట్ సహచరుల నడుమ వివాదం ప్రభుత్వానికి అపఖ్యాతి తీసుకురావడం ఖాయమన్న ఆందోళన అటు అయ్యన్న, ఇటు గంటా అనుచరుల్లో వ్యక్తమవుతోంది.