సాక్షి ప్రతినిధి,కడప: కడపలో టీడీపీ పరిస్థితి మూడడుగులు ముందుకేస్తే ఆరడుగులు వెనక్కి వెళ్లాల్సిన దుస్థితి. అలకలు, బుజ్జగింపులతో పుణ్యకాలం గడిచిపోతోంది. ఇంత కాలం రెండు గ్రూపులు.. నాలుగు వర్గాలుగా పయనించిన నేతలకు ఇప్పడు సరికొత్త సమస్య వచ్చిపడింది. అనూహ్యంగా జెడ్పీటీసీ మాజీ సభ్యుడు టింబర్ డిపో శ్రీనివాసులు తెరపైకి వచ్చారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని, అటో ఇటో తేల్చుకోవాలనే దశకు సీనియర్ నేతలు వచ్చినట్లు సమాచారం.
కడపలో గడ్డు పరిస్థితే..
జిల్లా కేంద్రంలో టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని పరిశీలకులు భావిస్తున్నారు. నాయకులు ఎవరికి వారుగా చలామణి అవుతూ వస్తున్న తరుణంలో పక్క నియోజకవర్గాల నేతల కన్ను కడపపై పడింది. రెండు పిల్లుల కాట్లాట గుర్తుకు రావడంతో కడప నేతలంతా మూకుమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చారు. ‘మనలో ఎవరికో ఒకరికి టికెట్ అప్పగిస్తే మనమంతా కలిసి కట్టుగా పనిచేస్తామనే’ సంకేతాలను అధినేత చంద్రబాబుకు చేరవేశారు.
అందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, మైనార్టీ నేత అమీర్‌బాబు, గోవర్దన్‌రెడ్డి, బాలకృష్ణ యాదవ్, హ రీంద్రనాథ్ ఒక జట్టు కాగా, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి సహకారంతో సుభాన్‌బాషా మరో జట్టుగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో టింబర్ డిపో శ్రీనివాసులు పేరు తెరపైకి రావడాన్ని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఏకపక్ష నిర్ణయాన్ని ప్రతిఘటించాల్సిందే...
టీడీపీలో ఇటీవలి కాలంలో ఏకపక్ష నిర్ణయాలు అధికమయ్యాయని పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఇందుకు కడప నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పరిణామాలను పార్టీ సీనియర్ నేతలు ఉదాహరణగా పేర్కొంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తనకు నచ్చిందే వేదంలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడుతూ వచ్చిన తమలో ఒకరిని పార్టీ అభ్యర్థిగా సిఫార్సు చేయకుండా కొత్తగా శ్రీనివాసులును తెరపైకి తేవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
పార్టీని దృష్టిలో పెట్టుకున్నట్లైతే సీఎం రమేష్ అందరితో చర్చించి ఉండేవారంటున్నారు. ఆ విధంగా కాకుండా కేవలం ఒకరిని పురమాయించి, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమంటున్న తమ్ముళ్ల ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేయాలనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.
‘దేశం’లో కోల్డ్‌వార్
Published Sat, Apr 5 2014 8:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement