పశ్చిమ టీడీపీలో ముసలం | cold war in west godavari district TDP over Penugonda MPP deal | Sakshi
Sakshi News home page

పశ్చిమ టీడీపీలో ముసలం

Published Thu, Jan 5 2017 9:21 AM | Last Updated on Sat, Aug 11 2018 2:53 PM

పశ్చిమ టీడీపీలో ముసలం - Sakshi

పశ్చిమ టీడీపీలో ముసలం

బెడిసికొట్టిన ఎంపీపీ ఎన్నిక ఒప్పందం
రాజీనామాకు ఎంపీపీ ససేమిరా


పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ ఎన్నిక ఒప్పందం బెడిసికొట్టడంతో తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. గడువు ముగిసినా రాజీనామాకు ప్రస్తుత ఎంపీపీ పల్లి జూలీ సురేఖ ససేమిరా అనడంతో ఆ పార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు.  2014 ఎన్నికల్లో ఎంపీపీ పదవికి తెలుగు దేశం పార్టీ తరఫున పల్లి జూలీసురేఖను ఎంపిక చేశారు. అయితే అనంతరం జరిగిన పరిణామాల్లో ఎంపీపీ పదవిని మొదటి రెండున్నరేళ్లు సురేఖకు, తరువాతి రెండున్నరేళ్లు చీకట్ల భారతికి కేటాయించారు. ఈ మేరకు కొంతమంది పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది.  దీని ప్రకారం ఎన్నికల ఖర్చును చీకట్ల భారతి నుంచి వసూలు చేసి పంచుకున్నారు. ఒప్పందం ప్రకారం బుధవారంతో ఎంపీపీ  జూలీ సురేఖ పదవీకాలం ముగిసింది. జనవరి 5న చీకట్ల భారతి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఎంపీపీ పల్లి జూలీ సురేఖ తన హయాంలో నిధుల కొరతతో అభివృద్ధి జరగలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని తేల్చిచెప్పడంతో సమస్య ఉత్పన్నమైంది. అప్పట్లో ఒప్పందం కుదిర్చిన నేతల వద్ద పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. రాజీనామా చేయబోనని ఎంపీపీ తెగేసి చెప్పడంతో స్థానిక నాయకులు ఆలోచనలో పడ్డారు.

వృద్ధ నాయకుడి భరోసా?
ఇదిలా ఉంటే ఎంపీపీగా పల్లి జూలీ సురేఖ ఒప్పందాన్ని అతిక్రమించడానికి మండలంలోని ఓ వృద్ధ నాయకుడి భరోసానే కారణమంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకుల సమక్షంలో చర్చలు నిర్వహిస్తూనే అంతర్గతంగా మద్దతు చెబుతున్నారంటూ టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సమక్షంలో ఎంపీటీసీ సభ్యులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎంపీపీకి వ్యతిరేకంగా నిలిచినా రాజీనామా చేయకపోవడానికి కారణం వృద్ధనేత భరోసానే కారణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వివాదం నేపథ్యంలో ఎంపీపీ, ఎమ్మెల్యే జన్మభూమి సభల్లోనూ ఎడముఖం, పెడముఖంగానే ఉంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement