ఊపిరి నిలిపిన మానవత్వం | Colleagues Helping Each Other | Sakshi
Sakshi News home page

ఊపిరి నిలిపిన మానవత్వం

Published Wed, Oct 23 2019 11:42 AM | Last Updated on Wed, Oct 23 2019 11:42 AM

Colleagues Helping Each Other - Sakshi

కుటుంబ సభ్యులతో నాగరాజు 

కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకోవాలన్న మనసు, సంకల్పం ఉన్న నలుగురు మనచుట్టూ ఉంటే చాలు అది ఎంత పెద్ద కష్టమైనా కరిగిపోతుంది. కాయకష్టం చేసి బతుకుపోరు సాగించే తమలో ఒకడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతుంటే చలించిపోయారా తోటి కూలీలు. బింధువులే సింధువైనట్లు..అందరూ ఒక్కటై తమకు తోచిన సాయం చేసి ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు.

సాక్షి, ప్రకాశం (ముండ్లమూరు) : కష్టకాలంలో తోడబుట్టిన వాళ్లనే పట్టించుకోని రోజులివి. అలాంటిది తోటి కూలికి ఆపద వస్తే అండగా నిలిచి మేమున్నాం అంటూ అందరూ ఒక్కటై లక్షల రూపాయలు విరాళాలుగా వసూలు చేసి అతనికి మరో జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. ముండ్లమూరు మండలం వేముల పంచాయతీలోని రమణారెడ్డిపాలెం గ్రామంలో సుమారు 300 కుటుంబాలున్నాయి. అన్ని గ్రామాల్లానే ఆ గ్రామంలోనూ మూడు పార్టీలు, రెండు మతాల వారు ఉన్నారు. కానీ ఆపదలో ఒక్కటై ఒకరికొకరు అండగా నిలిచి తోటి వారిలో మనోధైర్యాన్ని నింపారు. గ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాశ్యులు కావడంతో వారంతా బేల్దారి పనులకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. పదిమంది ఒక ముఠాగా ఏర్పడి కూలి పనులకు వెళ్తుంటారు. అందులో భాగంగా ఏటా తొలి ఏకాదశి అనంతరం ఇతర గ్రామాలకు వలసలు పోతుంటారు. ఈ ఏడాది బత్తుల నాగరాజు పదిమందిని తీసుకొని బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ సెప్టెంబర్‌ మొదటి వారం వెళ్లాడు.

అక్కడికి వెళ్లగానే జ్వరం బారిన పడ్డాడు. పనుల హడావిడిలో పట్టించుకోక పోవడంతో ముదిరి డెంగీగా మారింది. అనుకోకుండా పడిపోవడంతో దగ్గరలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నాగరాజు బాగా క్షీణించడంతో మెరుగైన వైద్యసేవలు అవసరమని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌జీ (శ్రీలక్ష్మీ గాయత్రి) సూపర్‌స్పెషాలిటీ వైద్యశాలలో చేర్చారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసిన అనంతరం నాగరాజుకి లివర్‌ పూర్తిగా దెబ్బతినిందని దీనికి తోడు డెంగీ అని నిర్ధారించారు. రెండు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో లాభంలేదని చెప్పారు. అప్పటికే అక్కడ మూడు లక్షల పదిహేను వేలరూపాయలు ఖచ్చు చేశారు. బతుకుతాడో లేదో చెప్పలేం గానీ హాస్పటల్‌లో రోజుకి లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే బంధువుల వద్ద మూడు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే గత ఏడాది నాగరాజు తండ్రి బాలకోటయ్యకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అందిన కాడికి అప్పులు చేసి చూపించినా తండ్రి బతకలేదు. వారు రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజుకి లక్ష రూపాయలు అంటే చాలా కష్టంతో కూడిన పని, ఇక వారికి అప్పు ఇచ్చేవారు కూడా లేరు. దీంతో నాగరాజుపై ఆశలు వదులుకున్నారు. 

తోటి కూలీల ఆపన్నహస్తం: 
ఇదే సమయంలో గ్రామానికి చెందిన మేస్త్రీలు, కూలీలు అతడిని చూసేందుకు హైదరాబాద్‌ వచ్చారు. పరిస్థితి విషమించడంతో మనతో నిన్నటి వరకు కలిసి పని చేసిన వ్యక్తిని ఎలాగైనా బతికించుకుందాం అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. నాగరాజు వైద్య ఖర్చుల కోసం తమకి తోచినంత సహాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరు తమ వెసులుబాటుని బట్టి రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు విరాళాలుగా నగదుని రూ.5,18,000 వసూలు చేశారు. వారికి తెలిసిన వైద్యులకు రిపోర్టులను చూపి వారి సలహా మేరకు నాగరాజుని హైదరాబాద్‌ నుంచి మంగళగిరి వద్ద  ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు తరలించేందుకు సన్నాహాలు చేశారు. వెంటిలేటర్‌ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లో సెప్టెంబర్‌ 23న ఎన్‌ఆర్‌ఐకి చేరుకున్నారు. నాగరాజు పరిస్థితిని చూసిన అక్కడి వైద్యులు లాభంలేదు, ఒంగోలు రిమ్స్‌కి తీసుకెళ్లండని సూచించారు. అక్కడ తెలిసిన మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌ సహాయంతో అక్కడే వైద్యం చేయించేందుకు ఒప్పించారు.

నాగరాజుకి ఏమైనా ప్రాణాపాయం అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకొన్న వైద్యులు నాగరాజుకి మళ్లీ అన్నీ పరీక్షలు చేసి చికిత్స చేయడం ప్రారంభించారు. దీంతో అతని పరిస్థితి రోజు రోజుకి కుదుట పడడంతో బతుకు పై ఆశలు చిగురించాయి. మరో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేయగా కొంత మేర కోలుకోవడంతో నాగరాజుని ఈనెల 9న ఇంటికి పంపారు. ప్రస్తుతం  అతని ఆరోగ్యం కుదుటపడింది. అందరి సహాయ సహకారాలతో నాగరాజు బతకడంతో గ్రామంలో ఇలాంటి అపాయం ఎవరికి వచ్చినా తామంతా అండగా నిలుద్దామని యువకులు నిర్ణయానికి వచ్చారు. తమకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నాగరాజు కుటుంబ సభ్యులు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగరాజు (ఫైల్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement