కలెక్టరేట్ ముట్టడిలో తోపులాట | Collecterate siege to the crowd | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ముట్టడిలో తోపులాట

Published Sat, Nov 15 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

కలెక్టరేట్ ముట్టడిలో తోపులాట

కలెక్టరేట్ ముట్టడిలో తోపులాట

వీవోఏల మహాధర్నాలో భాగంగా శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోతున్న మహిళా ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో ఒక మహిళ గాయపడింది. ఈ సందర్భంగా 287 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇందిరా కాంతి పథంలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీఓఏ లు-సీఎఫ్(గ్రామ ఆర్గనైజేషన్ సహాయకులు) తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. రెండు రోజులుగా చేపట్టిన మహాధర్నా ముగింపు కార్యక్రమంగా ఈ ముట్టడి చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళలు రెండు రోజులుగా అక్కడ వంటావార్పు నిర్వహించారు. శుక్రవారం ఉదయంనే వారు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అధికారులు, సిబ్బంది, ప్రజలు రాకపోకలు సాగించకుండా అడ్డంగా బైఠాయించారు. డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి వచ్చి వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారు.

దీంతో మహిళలు ఒక్కసారిగా లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. బకాయి పడిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన గేటు వద్దకు తోసుకుంటూ వెళ్లడంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మహిళల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఎచ్చెర్ల మండలానికి చెందిన దానేటి పార్వతికి చేయి విరిగింది. కాగా నరసన్నపేటకు చెందిన రమణమ్మది బంగారం రింగుపోయింది.

తోపులాట జరిగిన కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద పగిలిన గాజలు, తెగిన చెప్పులు భారీగా పడి ఉన్నాయి. ఉద్యమం ఉధృతం కావడంతో పోలీసులు మహిళలను ఆదుపులోకి తీసుకుని ఆరెస్టులు చేశారు. శ్రీకాకుళం, రూరల్, ఎచ్చెర్ల, ట్రాఫిక్ తదితర స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి సుమారు 287 మంది వీఓఎలను అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషనుకు తరలించారు. అక్కడ వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచి పెట్టారు.

హామీలు మరిచారు...
తొలుత ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అమ్మా ఆదుకుంటానని హామీ ఇచ్చి, గెలిచిన అనంతరం మీరు పోండి, మీ సేవలు మాకు వద్దు’ అని మొండికేస్తున్నారని ఆరోపించారు. అన్నారు. వీఓఏలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించకుంటే  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగకుండా డ్వాక్రా మహిళలంతా అడ్డుకుంటారన్నారు.

వీఓఏల సంఘం అధ్యక్షురాలు ఈ సుశీల మాట్లాడుతూ వీఓఎలతో వెట్టిచాకిరీ కూడా చేయించుకుని జీతాలు చెల్లించడం లేదని వాపోయారు. వెంటనే బకాయి వేతనాలు చె ల్లించాలని, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ెహల్త్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పీఎఫ్ వంటి ఇతర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముట్టడి కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం తిరుపతిరావు, నాగమణి, అమ్మాజీరావు, డి గణేష్, తేజేశ్వరరావు, ఎన్‌వీ రమణ, 38 మండలాల నుంచి వచ్చిన మహిళలు , వై.చలపతిరావు, కె.సూరయ్య, వీవోఏల సంఘం నాయకులు జి.అసిరినాయుడు, జి.ఎర్రయ్య, దుర్గ, రమణమ్మ, పార్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు న్యాయమైనవే...: పీడీ
వీఏల డిమాండ్లు న్యాయమైనవేనని ఈ సందర్భంగా డీఆర్‌డీఓ పీడీ ఎస్ తనూజారాణి విలేకరులతో అన్నారు. బకాయి వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్టు చెప్పారు. వీఓఏలు  సెల్‌ఫోన్లు, రికార్డులు అప్పజెప్పనవసరం లేదని, అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement