
కరీంనగర్: ‘నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా...మీరెవర్రా నాకు చెప్పేది. మీరు చెబితే వినాల్నారా? నా...కొడుకల్లారా’ అంటూ నగరపాలక సంస్థకు చెందిన ఓ డీఈ తన పైఅధికారులపై చిందులు వేశారు. బల్దియా వర్గాల్లో సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు విశ్వసనీయ వర్గాల కథనం మేరకు ఇలా ఉన్నాయి.
ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పైస్థాయి అధికారులు డీఈలు, ఏఈలకు కలెక్టరేట్‌కు రావాలని సమాచారం ఇచ్చారు.
ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే సమయంలోనే సదరు డీఈ ‘నేను రాను...నాకు పని ఉంది...కలవడం అవసరమా?’ అంటూ పెడసరిగా మాట్లాడడంతోనే సదరు అధికారి మిన్నకుండిపోయారు. అతను లేకుండానే అదనపు కలెక్టర్‌ను కలిసి బయటకు వస్తున్న క్రమంలో సదరు డీఈ సైతం కలెక్టరేట్‌కు వచ్చి తారసపడ్డారు. ‘పని ఉంది రానంటివి కదా?’ అని పైస్థాయి అధికారి ఒకరు అనడంతోనే డీఈ తిట్లదండకం అందుకున్నాడు.
పరుషపదజాలంతో దూషించడంతో పాటు, నానా బూతులు తిట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో అధికారులతో పాటు కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. సాక్షాత్తు కలెక్టరేట్‌లో తన పైఅధికారులను ఇష్టారీతిన డీఈ బూతులు తిట్టడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.
చెప్పుకునే దిక్కేది...?
నగరపాలకసంస్థ కార్యాలయంలో ‘పనిమంతుడు’గా గుర్తింపు పొందిన సదరు డీఈ కొంతకాలంగా ప్రదర్శిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ పనులు తన ‘చేతుల మీదుగా’ జరుగుతుండడం, ప్రజాప్రతినిధులతో ఉన్న సాన్నిహిత్యం అతడిని దారితప్పేట్లు చేస్తున్నాయనే ప్రచారం ఉంది.
కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఇతనే బాధ్యుడని, అంచనాలు, బిల్లులు పెంచడంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తన పై అధికారులను లెక్కచేయడని, బెదిరింపులకు గురిచేస్తాడని ఇతనికి పేరుంది.
ఇటీవల వరుసగా తన పైఅధికారులను, సహచర అధికారులను ఇష్టారీతిన బూతులు తిట్టినా.. అతనికి చిన్న మెమో కూడా జారీ కాలేదంటే అతడి పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. బాధిత అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సదరు డీఈని మందలించే సాహసంకూడా ఎవరూ చేయడంలేదు. ఏదిఏమైనా సదరు అధికారి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.