బరి తెగించిన.. బంగారు బుల్లోడు
- మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలు
- బాధ్యతాయుత పదవిలో ఉన్నానని మరచి.. రెచ్చిపోయిన వైనం
- ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలంటున్న మహిళా సంఘాలు
‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పుకోరు కదా! ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. హీరో రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు.. పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు.’
- ‘సావిత్రి’ సినిమా ఆడియో ఫంక్షన్లో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలవి.
(సాక్షిప్రతినిధి, అనంతపురం): బాలకృష్ణ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలోని లక్షలాదిమంది ప్రజల ప్రతినిధిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో పాటు 30 ఏళ్లపాటు కథానాయకునిగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాట్లాడే ప్రతి మాట అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ బాలకృష్ణ ఆ బాధ్యత మరిచారు. ఆయన మాటతీరు, ప్రవర్తన ‘డిక్టేటర్’ను తలపిస్తున్నాయి. ‘నాదో లోకం. నేను ఎలా వ్యవహరించినా..ఏం మాట్లాడినా తప్పులేదు’ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నారా రోహిత్ నటిస్తోన్న ‘సావిత్రి’ సినిమా ఆడియో ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేలాదిమంది అభిమానుల సమక్షంలో మహిళలను కించపరిచేలా మాట్లాడారు. ఈ మాటలు విని హీరో రోహిత్ నవ్వుతుంటే, కథానాయికలు మాత్రం తదేకంగా చూస్తుండిపోయారు.
ఈ మాటలేంటి?!
బాలయ్య వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. హిందూపురం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, చివరకు సామాన్య ప్రజలు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎమ్మెల్యేలా కాకుండా ఓ జులాయిలా మాట్లాడారని విమర్శిస్తున్నారు. రేపు అంతర్జాయతీ మహిళా దినోత్సవం ఉందని, కనీసం ఈ స్పృహ కూడా లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అంటున్నారు. ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యే పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్పీకర్ జోక్యం చేసుకుని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.
అంతా రాజకీయం కోసమే..
లేపాక్షి ఉత్సవాల పేరుతో గత నెల 27,28 తేదీల్లో బాలకృష్ణ హల్చల్ చేశారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై గొప్పగొప్ప మాటలు చెప్పారు. అలాంటి వ్యక్తి అసలు స్వరూపం ఆడియో ఫంక్షన్లో బట్టబయలైంది. లేపాక్షి ఉత్సవాలు కూడా కళలపై, తెలుగు సంప్రదాయాలపై గౌరవంతో చేసినవి కాదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేశారని ప్రజలు మండిపడుతున్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో లేరు. జన్మభూమి సభలకు కూడా హాజరుకాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఈ విమర్శల నేపథ్యంలో పక్కా ప్రణాళికతోనే లేపాక్షి ఉత్సవాలు నిర్వహించారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో హిందూపురంతో పాటు జిల్లా వాసులంతా ‘ఇతనూ...ఎమ్మెల్యేనా’ అని సిగ్గుపడుతున్నారు.
వెంటనే సస్పెండ్ చేయాలి
మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా ఉండాలి. ఎమ్మెల్యేగా ఉంటూ ‘మహిళలకు ముద్దు పెట్టాలి...కడుపు చేయాలి’ అని మాట్లాడటం చాలా దారుణం. నీచం. వెంటనే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపంగా రాజీనామా చేయాలి. లేదా స్పీకర్ సీరియస్‌గా తీసుకుని సస్పెండ్ చేయాలి.
- ఇమామ్, కదలిక ఎడిటర్
సుమోటోగా కేసు నమోదు చేయాలి
మహిళలను పూజించే దేశం మనది. కానీ బాలకృష్ణ కనీసం మనుషులుగా కూడా చూడలేదు. మహిళలపై ఆయనకు ఏరకమైన అభిప్రాయం ఉందో స్పష్టమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు.. బాలకృష్ణ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి. కోర్టులు బాలయ్య వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలి.
- బోయ సుశీలమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
సిగ్గుమాలిన మాటలు:
రాజకీయాల్లో హుందాగా ఉండాలి. కానీ బాలకృష్ణ సిగ్గుమాలిన మాటలు మాట్లాడారు. ఇలా చిల్లర మాటలతో మహిళా లోకాన్ని అగౌరవపరిస్తే రాజకీయాల్లో చులక నైపోతారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలి.
- సరస్వతి, లోక్‌సత్తా
మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు
నీకూ ఆడపిల్లలు ఉన్నారు కదా!
బాలకృష్ణకు ఇంకా సినిమా మైండ్‌సెట్ మారలేదు. రాజకీయాల్లోకి వచ్చినా మహిళలను సినిమాల్లో మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ఆయనకూ ఆడపిల్లలు ఉన్నారు కదా! ప్రభుత్వంలో అన్నీ తానై కన్పిస్తున్న బాలయ్యే ఇలా ఉంటే కార్యకర్తలు ఎలా ఉంటారో చెప్పేదేముంది. దీనిపై కోర్టులు, మహిళా కమిషన్లు స్పందించాలి.
- లలితారెడ్డి, జిల్లా చైర్పర్సన్, లయన్స్‌క్లబ్
తండ్రికి చెడ్డపేరు తెచ్చేశావు:
టీడీపీ నేతలు మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు కొడుకు ఓ మహిళపట్ల నీచంగా ప్రవర్తించాడు. బాలకృష్ణ మరీ ఘోరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల పట్ల టీడీపీ సిగ్గుపడాలి. ఎన్టీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేలా మాట్లాడారు.
- బీబీ, ఐఎంఎం మహిళా,
విభాగం జిల్లా అధ్యక్షురాలు
అంతర్లీనంగా ఉన్న అంశాలు బట్టబయలయ్యాయి
బాలకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన మనసులోని అంతర్లీన అభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు ఇలా మాట్లాడటం దురదృష్టకరం. అందరికీ నీతులు చెప్పే బాబు తన కుటుంబంలోని వ్యక్తుల ప్రవర్తనపై స్పందించాలి.
- రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి.