నిర్మల్: వరద నీటిలో చిక్కుకున్న బాధితులను సులువుగా రక్షించేందుకు ఎయిర్ బోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ సిబ్బందికి జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ చెరువులో ఎయిర్ బోట్స్ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు తెలిపారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు రోడ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిన్నటి వరకు సుమారు 210 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.
భైంసా డివిజన్‌లో చాలా మందిని పోలీస్ శాఖ ద్వారా రెస్క్యూ చేశామని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 60 మందిని పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి, రోప్‌తో, లైవ్ జాకెట్స్‌తో కాపాడారని వివరించారు. ఎయిర్ బోట్స్ ఉంటే ఇంకా సులువుగా, సిబ్బందికి కష్టం కలగకుండా కాపాడవచ్చన్నారు. ఎస్పీ, పోలీస్ శాఖతో చర్చించి, ఎయిర్ బోట్స్ శిక్షణకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దీంతో ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు రోప్స్ తెప్పించామన్నారు.
అనంతరం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు, రోప్స్ కొనడానికి సహకరించిన కలెక్టర్‌కు పోలీస్ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను మరింత సురక్షితంగా కాపాడలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ పురుషోత్తం, ఆర్‌ఐలు రమేశ్, రామకృష్ణ, ఎంపీవో వినోద్, ఆర్‌ఎస్‌ఐలు సాయికిరణ్, రవికుమార్, దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment