ఏలూరు, న్యూస్‌లైన్ : తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదివారం మినీ బైపాస్ రోడ్డులోని మత్స్యశాఖ కార్యాలయం పోలింగ్ బూత్‌లో బీఎల్‌వోకు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్‌ను కుర్చీలో కూర్చొమని బూత్‌లెవెల్ ఆఫీసర్ జయలక్ష్మి కోరినా ఆయన నిలబడే ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఓటుహక్కు కావాలంటే స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ఏదైనా ధృవపత్రం సమర్పించాలని బీఎల్వో జయలక్ష్మి కోరారు. ఆధార్ కార్డు ఉందా అని ప్రశ్నించగా తాను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఆధార్ కార్డు ఉందని, నివాస వివరాలన్ని అక్కడే ఉన్నాయని కలెక్టర్ సమాధానమిచ్చారు. రేషన్ కార్డు ఉందా అని బీఎల్వో ప్రశ్నించగా రేషన్ కార్డు తీసుకోవడానికి తనకు తీరిక ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.
ఖమ్మం అడ్రస్ ఉంటే ఇక్కడ పనికిరాదని, పోనీ ఏదైనా బ్యాంకు ఖాతా ఉందా అని జయలక్ష్మి కలెక్టరును ప్రశ్నించారు. బ్యాంకు ఖాతా ఇక్కడే ఉందని దాని నకలు వెంటనే సమర్పిస్తానని ఈ లోగా ఓటుహక్కు దరఖాస్తు ఫారాన్ని పరిశీలించాలని సిద్దార్ధజైన్ కోరారు. ఆమె దరఖాస్తును పరిశీలిస్తూ రెండు ఫొటోలకు బదులు ఒక ఫొటో ఇచ్చారు, మరో ఫొటో ఇవ్వాలని కోరారు. సరిగా చూసుకో అమ్మా. నీకు రెండు ఫొటోలు ఇచ్చా.. అంటూ కలెక్టర్ చిరునవ్వు చిందించారు. అనంతరం కలెక్టర్ దరఖాస్తు ఫారంపై సంతకం చేసి అందజేసిన లోగానే బ్యాంకు పాస్‌బుక్ నకలు కూడా సమర్పించారు. ఈ వ్యవహరం జరుగుతున్నంతసేపూ కలెక్టర్ సామాన్య పౌరుని మాదిరిగానే వ్యవహరించారు. ఓటరు నమోదు ప్రక్రియలో అనుసరించాల్సిన పద్ధతులపై బీఎల్వో వ్యవహరించిన తీరుపట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టరు హోదాలో కేంద్రాన్ని తనిఖీ చేశారు. నాలుగు వారాలుగా 109 దరఖాస్తులు అందాయని వాటిలో 98 విచారణ చేసి 91 మందికి ఓటుహక్కు కల్పించాలని సిఫార్స్ చేసినట్టు బీఎల్వో జయలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. మరో ఏడుగురు హైదరాబాదు, తిరుపతి తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఇక్కడ ఓటు కోసం దరఖాస్తు చేశారని వాటిని తిరస్కరించినట్టు తెలిపారు.
ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన కలెక్టర్
Published Mon, Dec 16 2013 2:27 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement