మాట్లాడుతున్న కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్
సాక్షి, విజయవాడ: జిల్లాలో సోమవారం నుంచి రోజుకు 800 నుంచి 1000 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఆదివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఆరు ట్రూనాట్ మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. వీటి ద్వారా రోజుకు ఎక్కువ మంది శాంపిల్స్ సేకరించవచ్చని తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా వస్తున్నాయన్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతంలో బూత్‌లు ఏర్పాటు చేసి ఈ శాంపిల్స్ తీసుకుంటామని చెప్పారు. శాంపిల్స్ పూలింగ్ కింద ఒకేసారి 16 మంది శాంపిల్స్‌ను పరీక్షించవచ్చని తెలిపారు.
ఈ ఫలితాల్లో పాజిటివ్ వస్తే విడివిడిగా మళ్లీ టెస్టింగ్‌లు చేసి పాజిటివ్ వ్యక్తిని గుర్తిస్తామన్నారు. తొలుత కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పరీక్షలు చేస్తారని, ఆ తరువాత మిగిలిన ప్రాంతాల్లో నిర్వహిస్తారని వివరించారు. వైద్య పరీక్షలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తొలి రోజు విజయవాడ కొత్తపేట, రాణిగారితోట, జగ్గయ్యపేట, నందిగామ మండలంలోని రాఘవాపురం, చందర్లపాడు మండలంలోని ముప్పాళ్లలో శాంపిల్స్ సేకరిస్తారని వెల్లడించారు. రెండో రోజు మంగళవారం సీతారాంపురం, కుద్దూస్‌నగర్, మచిలీపట్నం, నూజీవీడులో శాంపిల్స్ తీసుకుంటారని తెలిపారు. ఆయా ప్రాంతాల వారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఈ పరీక్ష చేయించుకుంటే కరోనా ప్రభావం తమపై ఉందేమోనన్న అనుమానాలు తొలగిపోతాయని చెప్పారు. జిల్లాలో 50 వేల పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఓపీ విభాగం
ప్రభుత్వాస్పత్రిని కోవిడ్–19 హాస్పిటల్‌గా మార్చినందున ఇక్కడ ఓపీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో అవుట్ పేషంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పిన్నమనేని హాస్పిటల్స్, జీజీహెచ్‌లో నిరంతరాయంగా వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారని, వారు ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా మారడంతో అక్కడే సమీపంలోని హోటళ్లలో వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆశా వర్కర్లు, వైద్యులు, నర్సులు, కాంపౌండర్లు ఈ కష్ట సమయంలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. .
కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ, వైరస్ బాధితులకు వైద్య సౌకర్యాలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదివారం అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి సిద్ధార్థ జైన్ అధికారులతో సమీక్షించారు.
ప్రభుత్వ వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకోండి
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్, ఫేస్‌బుక్, మెసేంజర్, చాట్‌బాత్ ద్వారా కోవిడ్–19 సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదివారం తెలిపారు. వాట్సాప్, చాట్‌బాత్ నంబర్ 82971 04104, చాట్‌బాత్ లింక్https://wa.me/918297104104/918297104104 ద్వారా కోవిడ్–19 నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా వైరస్ గురించి ప్రాథమిక సమాచారం, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సేవలకు సంబంధించి తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో ఆరోగ్య ఆంధ్రను ఫాలో అవ్వడం ద్వారా ప్రభుత్వ అధికార సమాచారం పొందవచ్చన్నారు. కరోనా వైరస్ గురించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ 104 లేదా 0866–2410978 నంబర్లు, covid&19info@ap.gov.inకు ఈమెయిల్ ద్వారా సమాచారం తెలియజేయవచ్చన్నారు
Comments
Please login to add a commentAdd a comment