సాక్షి, అమరావతి : మనుషులకే కాదు.. కుక్కలకూ కరోనా సోకుతోంది. ఆ మాటకొస్తే ఈ శునకాలు ఇప్పుడు కాదు.. వందేళ్ల క్రితం నుంచీ ఇవి కరోనా వైరస్ బారిన పడుతున్నాయి. కానీ ఇప్పుడు మనుషులకు ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడంతో జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుత తరుణంలో మనుషుల నుంచి కుక్కలకు ఈ వైరస్ సంక్రమిస్తోందని అమెరికాలో నిర్ధారణ అయ్యింది. అయితే వీటి నుంచి మనుషులకు సంక్రమిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
జిల్లాలో ప్రభావం..
కృష్ణా జిల్లాలోనూ పెంపుడు కుక్కలకు కరోనా వైరస్ సోకుతోంది. పశువైద్య శాఖ అధికారుల అంచనా ప్రకారం 2–3 శాతం పెంపుడు కుక్కలు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. వీటిని యజమానులు పశువైద్య శాలలకు తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు. జిల్లాలో దాదాపు 30 వేల పెంపుడు కుక్కలున్నట్టు ఆ శాఖ అధికారులు తేల్చారు. కరోనా సోకిన కుక్కలను వాటి యజమానులు పశువైద్యశాలలకు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ వైరస్ సోకిన కుక్కలకు సకాలంలో చికిత్స చేయించకపోతే 80 శాతం మరణించే ప్రమాదం ఉందని పశువైద్య అధికారులు చెబుతున్నారు. పెంపుడు కుక్కలకంటే వీధి కుక్కల్లో కరోనా వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. అందువల్ల పెంపుడు కుక్కలపైనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
కరోనా సోకిన కుక్కల లక్షణాలు..
∙కుక్కల సాధారణ టెంపరేచర్ 102 డిగ్రీలు.
∙కరోనా వైరస్ సోకితే 103–107 వరకు పెరుగుతుంది.
∙జ్వర లక్షణాలు కనిపిస్తాయి.
∙వాంతులు, రక్త విరేచనాలు అవుతాయి.
∙ఆహారం అంతగా తీసుకోదు.
∙కుక్క శరీరంలో వైరస్ ఏడు రోజుల పాటు ఉంటుంది.
వేయవలసిన మందులు..
∙కరోనా సోకిన మనుషులకు ఇచ్చినట్టే కుక్కలకూ యాంటీబయాటిక్స్ ఇస్తారు.
∙సిఫ్టాక్సిన్ 25ఎంజీ/కేజీ బరువుకు
∙పెరినార్మ్ .5 ఎంఎల్,
∙హిస్టాక్ 1 ఎంఎల్ ఇంజక్షన్. ఇలా ఐదు రోజులు ఇవ్వాలి.
∙వారం రోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చాక ఏడాదికొకసారి వ్యాక్సిన్ వేయించాలి.
అందుబాటులో వ్యాక్సిన్..
∙కుక్కలకు సోకిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోనే ఉంది.
∙ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.350–500 వరకు ఉంటోంది. ఈ వ్యాక్సిన్ పేరు కరోనా వ్యాక్సిన్.
∙కుక్కలను పెంచే వారు పరిశుభ్రత పాటించాలి.
యజమానులు జాగ్రత్తలు పాటించాలి..
కుక్కలకు కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక టెంపరేచర్, వాంతులు, రక్త విరేచనాలు వంటి లక్షణాలు కుక్కల్లో కనిపిస్తే అది కరోనాగా నిర్ధారించుకోవాలి. ఈ లక్షణాలున్న కుక్కలను వాటి యజమానులు సమీపంలోని పశువైద్య శాలలు, గన్నవరం వెటర్నిరీ కాలేజీ, లబ్బీపేట ఎన్టీఆర్ వెటరినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం అందుతోంది. వ్యాక్సిన్ మాత్రం యజమానులే కొనుక్కోవాలి. – కొక్కెరగెడ్డ విద్యాసాగర్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ
Comments
Please login to add a commentAdd a comment