సాక్షి, విజయవాడ: కరోనా విపత్కర సమయంలో చంద్రబాబు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు.ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా క్లిష్టపరిస్థితుల్లో కూడా చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్నపుడు 5వేల డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. నీతి ఆయోగ్ కూడా ఆయన లేఖలను మెచ్చుకుందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఒక్క ఆస్పత్రి, పీహెచ్‌సీని అభివృద్ధి చేయకుండా గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీలో కూడా రూ. 680 కోట్ల బకాయిలు పెట్టిపోయారని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ నిధులు నిలిపి కొన్ని వేల మంది ప్రజలను ఇబ్బందులు పెట్టారని అన్నారు. బాబు బాధ్యతగా లేకపోతే తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుతగిలితే సహించమన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా చేయని టెస్టులు ఏపీలో చేస్తున్నామని తెలిపారు. (ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టులకు అనుమతి తప్పనిసరి)
రాష్ట్రంలో ఇప్పటి వరకు 16లక్షల 43వేల 319మందికి టెస్టులు చేశామని ఆళ్లనాని చెప్పారు. అదే విధంగా ప్రతిరోజు 50వేల టెస్ట్లు నిర్వహిస్తున్నామని టెస్టుల కోసమే రోజుకు రూ.5 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. రెడ్ జోన్ క్లస్టర్లలో ఎక్కువగా టెస్ట్లు చేయటం వల్ల కేసులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి లక్షణాలు, పాజిటివ్ ఉన్న వారికి ఇక్కడ నుంచి సలహాలు, సూచనలు ఇస్తున్నామని తెలిపారు. 138కోవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేశామని వాటిల్లో 4300ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. 17,370నాన్ ఐసీయూ బెడ్స్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటికే 1,513వెంటిలేటర్స్ ఉన్నాయని, అదనంగా మరో వెయ్యి వెంటిలేటర్లను తెప్పిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోతే ఆస్పత్రులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయో తెలిసేలా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కోవిడ్ పేషేంట్లకి అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి నెల కోవిడ్‌కి రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment