సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తీవ్ర జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులుంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వాలంటీర్లకు తెలపాలని దండోరా వేయించామని పేర్కొన్నారు. మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే కాల్‌సెంటర్లకు కాల్ చేయాలని జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 94శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉన్నవారు వాలంటీర్లకు చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. కరోనా పేషెంట్ బంధువులకు వివరాలు తెలిపేందుకు హెల్ప్ డెస్క్‌ను పెట్టామని ఆయన తెలిపారు. (భారత్: రెండో రోజు 60 వేలు దాటిన కరోనా కేసులు)
రాష్ట్రంలో 8.76 శాతం పాజిటివ్ రేటు, 0.89 శాతం మరణాల రేటు ఉందని తెలిపారు. దీని బట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనల్ని అభినందిస్తోందని గుర్తుచేశారు. మూడు, నాలుగు రోజులుపాటు జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే తక్షణమే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ లక్షణాలుంటే పరీక్ష చేయకపోయినా ఆస్పత్రిలో చేరాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాల్ సెంటర్లు పెట్టామని వ్యాఖ్యానించారు. వెంటనే ఆస్పత్రిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చివరిదశలో ఆస్పత్రికి రావడం వలన కాపాడలేకపోతున్నామని అన్నారు. కనీసం ఆరురోజులు ఆస్పత్రిలో ఉంటే ప్రాణాలు కాపాడగలమని చెప్పారు. ఈ విషయంలో డాక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు.
ప్రతి ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచామన్నారు. 104ద్వారా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో కూడా నిరంతరం పనిచేసే కాల్ సెంటర్లు పెట్టామన్నారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరేంతవరకు ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌ని ఏర్పాటు చేశామన్నారు. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు బాధ్యతగా ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తోందని గుర్తుచేశారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్ తప్పని సరిగా ధరించి బయటకు రావాలన్నారు. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 6 నెలలు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
యూనిసేఫ్ సహాయంతో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 20వేల మంది సిబ్బంది, 10వేల మంది ట్రైనీ నర్సులను కేటాయించామని వెల్లడించారు. అదనంగా వెయ్యి వెంటిలేటర్లు తెప్పించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని, యాంటీబాడీస్ సర్వే నాలుగు జిల్లాల్లో మొదలు పెట్టామన్నారు. సీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ బెడ్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 14వేల వరకు ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామన్నారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 70 శాతం చనిపోతున్నారని తెలిపారు. జూనియర్ డాక్టర్లకు జీతాలు పెంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment